Begin typing your search above and press return to search.

గ్రేటర్ మేయర్.. సీల్డ్ కవర్ లో భద్రం

By:  Tupaki Desk   |   8 Feb 2021 4:07 AM GMT
గ్రేటర్ మేయర్.. సీల్డ్ కవర్ లో భద్రం
X
మరో మూడు రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ కు మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ సందర్భంగా ఎవరికి ఆ పదవి దక్కుతుందన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పలువురు పేర్లు వినిపించినా.. ఎవరూ కూడా ఫలానా వారు మేయర్ అవుతారని బలంగా చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా నిర్వహించిన పార్టీ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు సీఎం కేసీఆర్. పదకొండున జరిగే మేయర్.. డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి పార్టీ అభ్యర్థుల పేర్లు అదే రోజున వెల్లడిస్తామన్నారు.

ఈ నెల 11న మేయర్.. డిప్యూటీ మేయర్ ఎవరన్న విషయాన్ని తానే పేపర్ మీద రాసి.. సీల్డ్ కవర్లో పంపిస్తానని.. ఆ రోజు పార్టీ కార్పొరేటర్లు.. ఎక్స్ అఫీషియో సభ్యులంతా ఉదయం తొమ్మిది గంటలకు తెలంగాణ భవన్ కు రావాలన్నారు. తెలంగాణ భవన్ నుంచే జీహెచ్ఎంసీ ఆఫీసుకు వెళ్లాలన్నారు. అక్కడికి వెళ్లాకే సీల్డ్ కవర్ ఓపెన్ చేయాలన్నారు. అంతేకాదు.. గ్రేటర్ మేయర్.. డిప్యూటీ మేయర్ ఎన్నిక బాధ్యతను కేటీఆర్ కు అప్పజెప్పనున్నట్లు ప్రకటించారు.

ఇంతకాలం.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల్ని ఉద్దేశించి.. సీల్డ్ కవర్ అంటూ ఎక్కసెం చేసిన కేసీఆర్.. ఇప్పుడు అదే సీల్డ్ కవర్ విధానాన్ని తెర మీదకు తీసుకురావటం గమనార్హం. మన ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోలేమా? అక్కడెక్కడో ఢిల్లీలో ఉండి డిసైడ్ చేయటం ఏమిటి? లాంటి మాటల్ని రానున్న రోజుల్లో కేసీఆర్ నోటి నుంచి వస్తే బాగుండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. గ్రేటర్ మేయర్.. సీల్డ్ కవర్ మేయర్ అన్న విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లే.