Begin typing your search above and press return to search.

సీఎం ఇల్లు అంటే ఎలా ఉండాలో చెప్పిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   3 Aug 2017 4:26 AM GMT
సీఎం ఇల్లు అంటే ఎలా ఉండాలో చెప్పిన కేసీఆర్‌
X
తాను చేసే ప‌నిని స‌మ‌ర్థించుకునే విష‌యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర్వాత‌నే ఎవ‌రైనా. ఇటీవ‌ల కాలంలో మీడియాతో మాట్లాడ‌నంత సుదీర్ఘంగా ఆయ‌న తాజా మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా గ‌డిచిన కొన్ని నెల‌లుగా త‌న‌పై విప‌క్ష నేత‌లు చేసే అన్ని ఆరోప‌ణ‌లపైనా.. విమ‌ర్శ‌ల పైనా స్పందించారు. ప్ర‌తి ఒక్క అంశం మీదా స్పందించిన ఆయ‌న‌.. విప‌క్షాల తీరును తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. త‌న ప‌నుల్ని స‌మ‌ర్థించుకున్నారు.

ఈ క్ర‌మంలో సీఎం నివాసంపై వస్తున్న విమ‌ర్శ‌ల‌కు త‌న‌దైన శైలిలో స‌మ‌ర్థించుకున్నారు.

సీఎం ఇల్లు అంటే ఎలా ఉండాలో చెప్పిన కేసీఆర్ మాట‌ల్ని.. ఆయ‌న నోటి మాట‌ల్లోనే వింటే ఆ ఎఫెక్ట్ వేరుగా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

"మొన్న‌టి దాకా ఉన్న‌టువంటి సీఎం క్యాంప్ ఆఫీస్‌. అది బ్రిటీషోళ్లు వాడిన మాట‌. అదే త‌ప్పు. సీఎంవో ఇల్లు అని ఏదైతే క‌ట్టిర్రో.. లోప‌లికి ఒక్క ముఖ్య‌మంత్రి కారు పోద్ది అంతే. ఎస్కార్ట్ వాహ‌నం కూడా పోదు. మంత్రి వ‌చ్చినా.. ఎవ‌ర‌చ్చినా.. విదేశీ ప్ర‌తినిధి వ‌చ్చినా.. కేంద్ర‌మంత్రి వ‌చ్చినా.. బ‌య‌టదిగి న‌డిచి రావాల్సిందే. అట్ల ఉండ‌చ్చున్నా. మంచిగా ఉండాలె"

"విశాలంగా ఉండాల‌ని.. ఓ వంద‌.. 200 కార్లు ప‌ట్టేట్లు ఉండాలి. దేశంలో లేవా ముఖ్య‌మంత్రుల ఇండ్లు. ఇది క‌డితే కూడా దీని మీద ఒక క‌థ‌నే. అన్ని సొల్లు పురాణాలు చూసినం. ఎంత దిగ‌జారి అంటే.. తెలంగాణ బికారి రాష్ట్రమా? నిజాం మ‌న‌కు ల‌క్ష‌ల ఎక‌రాలు ఇచ్చి పోయిండు. ఎంత గొప్ప‌గా క‌ట్టాల్సి ఉండె. అసెంబ్లీ ఇవ‌న్నీ. మీకు అనాడు తెలివి లేదు. ఈనాడు మేం క‌డ‌తం అన్న దానికి మీద స్టే. దాని మీద ధ‌ర్నా. అది వ‌ద్దు.. త‌యారు కావొద్దు. టీఆర్ ఎస్ మార్కు.. కేసీఆర్ మార్కు ఉండ‌ద్దు శాశ్వ‌తంగా. అది ఏడుపు అస‌లు. మేం జేయ‌లే.. మీరు జేయద్దు. ఇదా ప‌ద్ధ‌తి" అని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. కేసీఆర్ మాట‌ల్ని చూస్తే కొన్ని సందేహాలు రాక మాన‌వు. సీఎం ఇల్లు అంటే వంద‌.. రెండు వంద‌ల కార్లు ప‌ట్టేంత జాగా ఉండాలె అంటే.. ప్ర‌ధాన‌మంత్రి లాంటోడి ఇల్లు అంటే ఐదారు వంద‌ల కార్లు ప‌ట్టేంత ఉండాల‌? అన్న‌ది డౌట్‌.

ప్ర‌ముఖులు.. కీల‌క‌స్థానాల్లో ఉండే ఇళ్లు భారీగా.. విశాలంగా ఉండాల‌ని.. లేని ప‌క్షంలో అది చేత‌కానిత‌నం అన్న‌ట్లుగా మాట్లాడ‌టం ఏంద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. నాడు క‌ట్టిన ఇళ్లు చిన్న‌విగా ఉన్నాయంటే.. నాటి ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు అనుకోవాలె. ఇప్పుడున్న అసెంబ్లీకి ఏం త‌క్కువ‌?

మ‌రో పాతికేళ్ల త‌ర్వాత మ‌రో కేసీఆర్ లాంటి మాంచి మాట‌కారి వ‌చ్చి.. ఛీ.. సీఎం ఇల్లు అంటే క‌నీసం వెయ్యి కార్లు ప‌ట్టేంత ఉండాలే కానీ.. ఈ అగ్గిపెట్ట‌ల్లాంటి ఇళ్లు ఏమిటంటే? ప‌్ర‌తిప‌క్షాలు త‌ప్పుగా మాట్లాడే మాట‌ల్ని త‌ప్పు ప‌ట్ట‌టం త‌ప్పేం కాదు. కానీ.. వారు ప్ర‌స్తావించిన ప్ర‌తి విష‌యం మీదా దుమ్మెత్తిపోసే తీరు ఏ మాత్రం స‌రికాద‌న్న విష‌యాన్ని కేసీఆర్ ఎందుకు ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. తెలంగాణ రాష్ట్రంలో హైద‌రాబాద్ మిన‌హా.. మిగిలిన ప్రాంతంలో అభివృద్ధి ఎంత‌న్న‌ది తెలిసిందే. దాని మీద దృష్టిపెట్టాలే కానీ.. ముఖ్య‌మంత్రి ఇల్లు ఎంత విశాలంగా ఉండాలో తెలుసా? అంటూ గ్రాండియ‌ర్ మాట‌లు ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని గెల‌వ‌లేద‌న్న విష‌యాన్ని కేసీఆర్ గుర్తిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.