Begin typing your search above and press return to search.

కేంద్రం వెంటే మేం - చైనా వస్తువుల బ్యాన్ తొందరపాటు: కేసీఆర్

By:  Tupaki Desk   |   19 Jun 2020 4:35 PM GMT
కేంద్రం వెంటే మేం - చైనా వస్తువుల బ్యాన్ తొందరపాటు: కేసీఆర్
X
భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు - సంస్థలు చైనా వస్తువుల బహిష్కరణ కోసం పిలుపునిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ అంశంపై 20 పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వివిధ అంశాలపై మాట్లాడారు. సరిహద్దులో ఘర్షణ నేపథ్యంలో తొందరపాటు సరికాదని - అదే సమయంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదన్నారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక - దీర్ఘకాలిక వ్యూహాలు అవసరమన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం కాదని - యుద్ధనీతి అవసరమన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రానికి తాము అండగా ఉంటామన్నారు. మన దేశంలో సుస్థిర పాలన ఉండటం - గొప్ప ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడాన్ని చైనా భరించలేకపోతోందని - అందుకే కాలుదువ్వుతోందన్నారు. చైనా - పాకిస్తాన్ వంటి దేశాలకు తమ దేశాల్లో అంతర్గత సమస్య తలెత్తినప్పుడు సరిహద్దులో ఘర్షణ వాతావరణం సృష్టించడం పరిపాటిగా మారిందన్నారు. కేవలం మన దేశంతోనే కాదని, మలేషియా - పిలిప్పీన్స్ - జపాన్‌ లతోను కయ్యానికి కాలు దువ్వుతోందన్నారు.

ఇలాంటి ఘటనలో గతంలోను జరిగాయని - 1957 నుండి సరిహద్దు వివాదం మొదలైందని - ఆ తర్వాత 1962లో యుద్ధమే జరిగిందని - 1967లో సరిహద్దులో జరిగిన ఘర్షణలో 200 మంది చనిపోయారని గుర్తు చేశారు. చైనా నుండి మన దేశానికి ఎప్పటికైనా ప్రమాదమేనని - మనం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లవలసి ఉందని చెప్పారు. గాల్వాన్ లోయలో అమరుడైన తెలంగాణ సంతోష్ బాబు కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించామని తెలిపారు.

ప్రపంచంలో అమెరికా తర్వాత 14 ట్రిలియన్ డాలర్లతో చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని - భారత్ క్రమంగా ఎదుగుతోందని - 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే మన లక్ష్యాన్ని సహించలేకపోతోందన్నారు. కరోనా నేపథ్యంలో చైనా నుంచి చాలా కంపెనీలు వెళ్లిపోతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో 142వ స్థానం నుండి మన దేశం 63 స్థానానికి ఎగబాకిందని గుర్తు చేశారు. పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయని చెప్పారు.

అయితే చైనా నుండి వస్తువుల దిగుమతిని ఆపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని - అది తొందరపాటు చర్య అన్నారు. ప్రస్తుతం మన దేశం ఆ వస్తువుల తయారీ దిశగా ఎదగాలని - సరసమైన ధరలకు దొరకాలన్నారు. బ్రిటన్ ప్రతిపాదించిన డి10 గ్రూప్‌ లో భారత్ కలవాలన్నారు. మనం వ్యూహాత్మకంగా ముందుకు సాగాలన్నారు.