Begin typing your search above and press return to search.

కేసీఆర్ తో భోజనం చేయాలంటే కండీషన్ అదేనట!

By:  Tupaki Desk   |   29 Nov 2019 5:01 AM GMT
కేసీఆర్ తో భోజనం చేయాలంటే కండీషన్ అదేనట!
X
ఏదైనా పంచాయితీ కానీ.. ఇంకేదైనా విషయం కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక అలవాటు ఉంది. ఏదైనా విషయం పీటముడి పడితే.. దాన్ని విప్పదీసే క్రమంలో ఒక రోజు కలుద్దాం. మాట్లాడుకుందాం.. భోజనం చేద్దామన్న మాట అన్యాపదేశంగా ఆయన నోటి నుంచి వస్తుంది. తాజాగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఇష్యూలోనూ అదే మాటను ఆయన చెప్పారు.

49 వేల మంది కార్మికులు ఉన్న ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి.. బస్సులు తదితర అంశాల మీద తెలుగులో డాక్యుమెంట్ ఒకటి ప్రింట్ చేసి కార్మికులకు ఇస్తామని.. దాన్ని చదువుకొని వస్తే మాట్లాడి భోజనం చేద్దామన్న ఆఫర్ ఇచ్చారు ముఖ్యమంత్రి. సమస్యను ఎలా పరిష్కరించాలి? ఎక్కడ పొడిగించాలి? ఎక్కడ తగ్గించాలి? లాంటివి అందరితో కలిసి నిర్ణయం తీసుకుందామన్నారు. యూనియన్లు అంటే మాత్రం రానిచ్చేది లేదన్నారు.

తాను మొదట్నించి చెబుతున్నట్లు ఆర్టీసీలో సంఘాలు ఇకపై ఉండవని తేల్చేశారు. ఉద్యోగ భద్రత కోరుకుంటే తప్పు లేదని.. క్రమశిక్షణారాహిత్యంతో వ్యవహరిస్తే దేవుడు కూడా కాపాడలేరని తేల్చేశారు. తాను మరో ఐదారు రోజుల్లో ప్రధాని మోడీని కలవనున్నానని.. అంతకు ముందే ప్రతి డిపో నుంచి కార్మికుల్ని పిలిపించి మాట్లాడతానని చెప్పారు.

కార్మికులపై కక్ష సాధింపు ఉద్దేశం తనకు లేదని.. సన్నాసులు చేసే ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ఇప్పుడున్న యూనియన్లది ఉన్మాదమని.. వారి మాట వింటే బజారున పడతారన్నారు. తాత్కాలిక ఉద్యోగులు.. మహిళలు.. పురుషులు సమ్మె కాలంలో బాగా పని చేశారని.. వారిని సానుభూతితో చూస్తామన్నారు. మొత్తంగా తాను చెప్పినట్లు వింటే సంస్థ ఉంటుంది.. మీరు ఉంటారన్న విషయాన్ని కేసీఆర్ చెప్పేశారని చెప్పాలి.