Begin typing your search above and press return to search.

కొత్త సచివాలయ ఓపెనింగ్ కు జగన్ ను పిలవని కేసీఆర్..

By:  Tupaki Desk   |   25 Jan 2023 3:00 PM GMT
కొత్త సచివాలయ ఓపెనింగ్ కు జగన్ ను పిలవని కేసీఆర్..
X
కేసీఆర్ కలల సౌధం సెక్రటేరియట్ ను ఫిబ్రవరి 17న ప్రారంభించనున్నారు. ఆరోజు కేసీఆర్ భర్త్ డే కూడా కావడంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద పండుగలా నిర్వహించనున్నారు. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ పలు రాష్ట్రాల సీఎంలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఖమ్మంలో నిర్వహించిన సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు హాజరయ్యారు. అయితే అప్పుడు హాజరు కాని వారిని సెక్రటేరియట్ ఈవెంట్ కు ఆహ్వానిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఘండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ సెక్రటేరియట్ ప్రారంభానికి రానున్నారు. వీరితో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్ హాజరయ్యే అవకాశం ఉంది. అయితే తోటి తెలుగు, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదట. అంతేకాదు ఆయనకు ఇన్విటేషన్ కూడా పంపలేదట. కారణమేంటంటే..?

ఎన్ని వివాదాలున్నా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసే ఉంటారని కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పిన వీడియోలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఆయన చంద్రబాబు, జగన్ తో సత్సంబంధాలనే కొనసాగించారు. అంతేకాకుండా తెలంగాణలో గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ను కూడా రప్పించారు. అయితే మధ్య మధ్యలో విభజన సమస్యలపై పోటా పోటీ ప్రకటనలు చేసినా కొన్ని విషయాల్లో స్నేహంగానే మెదిలారు. కానీ బీఆర్ఎస్ ఏర్పాటు నుంచి కేసీఆర్ జగన్ పేరు ఎత్తడం లేదు. అటు జగన్ సైతం బీఆర్ఎస్ గురించి ఒక్క వ్యాఖ్య చేయడం లేదు.

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తరువాత వెంటనే కేసీఆర్ ఏపీ కమిటీ వేశారు. ఏపీలోని కొందరు రాజకీయ ప్రతినిధులు హైదరాబాద్ వెళ్లి మరీ గులాబీ కండుగా కప్పుకున్నారు. ఆ తరువాత ఖమ్మంలో నిర్వహించిన సభకు ఏపీ నుంచి కూడా ప్రజలను రప్పించారు. వీరిని తీసుకురావడానికి ఆర్టీసీ బస్సులను కూడా వాడారు. అయినా జగన్ ఈ విషయంలో ఒక్క మాట కూడా అనలేదు. అయితే ఆ పార్టీకి చెందిన నేతలు మాత్రం బీఆర్ఎస్ తో ఒరిగిందేమీ లేదని అని క్లోజ్ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ నిర్వహించే పలు కార్యక్రమాలకు జగన్ ను ఆహ్వానించడం లేదు.

దీంతో వీరిద్దరి మధ్య ఇన్నర్ గా అవగాహన ఒప్పందం జరిగిందా..? లేక నిజంగానే వివాదం ఏర్పడిందా..? అనే చర్చ సాగుతోంది. ఇన్నర్ ఒప్పందం విషయం పక్కనబెడితే.. కేసీఆర్, జగన్ ల మధ్య నీటి ప్రాజెక్టులతో వివాదాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. అటు షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభం నుంచి బీఆర్ఎస్ నాయకులపై పట్టపగ్గాలు లేకుండా వ్యాఖ్యలు చేయడంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో టీడీపీని అడ్డుకోవడానికి తెలంగాణలో మళ్లీ ఆంధ్రా పార్టీలు ఎంట్రీ ఇస్తున్నాయని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆ మధ్య విభజన సమస్యలపై కొందరు బీఆర్ఎస్ మంత్రులు వైసీపీ నాయకులపై విమర్శలు చేశారు. పైకి ఇలా విమర్శిస్తూ మళ్లీ జగన్ ను ఆహ్వానిస్తే ప్రజల్లో బ్యాడ్ ఇంప్రషన్ ఏర్పడుతుంది.

ఈ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడుతుంది. అందుకే జగన్ తో ఎక్కువగా సత్సంబంధాలు పెట్టుకోవడం లేదని అనుకుంటున్నారు. అటు జగన్ కూడా ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో వీరిద్దరి మధ్య నిజంగానే అవగాహన ఒప్పందం జరిగిందా..? అనే చర్చ సాగుతోంది. అయితేవచ్చే ఎన్నికల నాటికి అసలు విషయం బయటపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.