Begin typing your search above and press return to search.

రోడ్లపై ‘కొత్త కల’ను ఆవిష్కరించిన కేసీఆర్

By:  Tupaki Desk   |   19 Oct 2016 5:12 AM GMT
రోడ్లపై ‘కొత్త కల’ను ఆవిష్కరించిన కేసీఆర్
X
‘‘పాతవాటిని వదిలేద్దాం. ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచిద్దాం’’ అన్నట్లుగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తే. కొత్తొక వింత.. పాతొక రోత అన్న మాటను నూటికి నూటయాభై పాళ్లు నమ్మిన వ్యక్తిగా తెలంగాణ ముఖ్యమంత్రి కనిపిస్తారు. విషయం ఏదైనా సరే.. ‘కొత్త’గా ఆలోచించాలనే మాటను చెప్పటమే కాదు.. ఎప్పటికప్పుడు ‘కొత్త.. కొత్త’ కలల్ని ఆవిష్కరిస్తూ.. ‘కొత్త’ ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లే సరి‘కొత్త’ టాలెంట్ కేసీఆర్ సొంతంగా చెప్పక తప్పదు.

ఇప్పటికే ఎన్నో ‘కొత్త’ కలల్ని ఆవిష్కరించిన ఆయన.. తాజాగా రోడ్ల మీద కూడా తన ‘కొత్త’ విజన్ ను బయటపెట్టారు. ఏదైనా అంశం తన దృష్టికి వచ్చిన వెంటనే గంటల పాటు సమీక్షను నిర్వహించే ‘కొత్త’ అలవాటును తెలుగు ప్రజలకు పరిచయం చేసిన కేసీఆర్.. తాజాగా రోడ్ల మీద రివ్యూ పెట్టేశారు. ప్రభుత్వంలోని పెద్ద తలకాయల్ని మరో ‘కొత్త’ కల కోసం మీటింగ్ పెట్టిన ఆయన.. తెలంగాణ వ్యాప్తంగా రోడ్లను సరి ‘కొత్త’గా తీర్చిదిద్దాలన్న తన కలను ఆవిష్కరించిన ఆయన.. ఆ ‘కొత్త’ కల అదిరిపోయేలా ఉండాలన్న విషయాన్ని నొక్కి వక్కాణించిన వైనం మరింత ‘కొత్త’గా ఉందనే చెప్పాలి.

ఇటీవల కాలంలో రోడ్ల ప్రమాదాల్లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతున్న నేపథ్యంలో.. అలాంటి వాటికి చెక్ పెట్టేలా రహదారులకు సంబంధించిన ‘కొత్త’ విజన్ డాక్యుమెంట్ ఒకటి సిద్ధం చేయాలని కోరారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అవతల 330 కిలోమీటర్ల మేర నిర్మించాలని భావిస్తున్న రీజినల్ రింగు రోడ్డును రెండేళ్లలో పూర్తి చేయాలన్న ‘కొత్త’ టార్గెట్ ను విధించిన కేసీఆర్.. పనులను వేగిరం పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని సమీక్షించిన కేసీఆర్.. తన విజన్ ను ‘కొత్త’గా ఆవిష్కరించారు.

‘‘ఫ్యూచర్ లో మన రోడ్లు ప్రమాదాలకు దూరంగా ఉండాలి. నిత్యం రోడ్ల మీద ఎందరో చనిపోవటం కలిచివేస్తోంది. దీన్ని వెంటనే నియంత్రించాలి. భవిష్యత్ లో మన రోడ్లు సేఫ్ గా ఉండాలంటే ఏం చేయాలి? ఓ పదేళ్ల తర్వాత తెలంగాణ రోడ్ నెట్ వర్క్ ఎలా ఉండాలి? ప్రభుత్వ పరంగా అందుకు చేయాల్సిందేమిటి? దేశంలోనే నెంబర్ వన్ రోడ్లను ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలి? అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్ నెట్ వర్క్ కు డాక్యుమెంట్ సిద్ధం చేయండి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రోడ్లను అధ్యయనం చేసి.. వచ్చే పదేళ్లలో కార్యాచరణ ఎలా ఉండాలో సిద్ధం చేయండి. అమెరికా.. యూరప్ దేశాల్లో రోడ్లు బాగుంటాయి. అక్కడ అనుసరిస్తున్న విధానాల్ని.. పద్దతుల్ని అధ్యయనం చేయండి’’ అంటూ ‘కొత్త’గా మార్గనిర్దేశం చేశారు. నెలల తరబడి రోడ్ల అవస్థలతో తెలంగాణ ప్రాంతంలో నివసించే ప్రజలు కిందామీదా పడుతుంటే.. కళ్లు తెరిచిన ముఖ్యమంత్రి పదేళ్ల తర్వాత రోడ్లు ఎలా ఉండాలన్న అంశంపై విజన్ డాక్యుమెంట్ చేస్తున్న ఆయన ‘కొత్త’ ఆలోచనల్ని ఎలా అర్థం చేసుకవాలో అర్థం కాని పరిస్థితి. నిత్యం నరకప్రాయంగా మారిన రోడ్లను యుద్ధప్రాతిపదికన మార్చటానికి ఏం చేయాలి? ఎంత స్వల్ప వ్యవధిలో ఈ సమస్యను అధిగమిస్తామన్న దాని కంటే.. విజన్ డాక్యుమెంట్ తయారీ మీద మక్కువ ప్రదర్శిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి సరి‘కొత్త’ విజన్ ను ఎలా అర్థం చేసుకోవాలంటారు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/