Begin typing your search above and press return to search.

కూతురు కోసమే కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్లారట!

By:  Tupaki Desk   |   6 April 2019 7:49 AM GMT
కూతురు కోసమే కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్లారట!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు ఒక పట్టాన అంచనా వేసేందుకు ఆయన అవకాశం ఇవ్వరు. తన మంత్రివర్గంలోని మంత్రుల్ని కలిసేందుకు.. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు సైతం ఆయన్ను కలిసేందుకు.. అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా? అని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. సొంత పార్టీకి చెందిన ముఖ్య నేతల సంగతి ఇలా ఉంటే.. ప్రభుత్వంలో కీలక అధికారులు సైతం సీఎం కేసీఆర్ నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందా? అంటూ చకోర పక్షుల్లా ఎదురుచూస్తుంటారు. ఇలా.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా కేసీఆర్ తో భేటీ కోసం తహతహలాడిపోతుంటారు.

అంతటి పవర్ ఫుల్ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేని ఒక పాతతరం నేత ఇంటికి వెళతారా? అది కూడా.. తనతో పాటు ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలను వెంట పెట్టుకొని వెళ్లటం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్ గా ఉండి. . తర్వాతి కాలంలో పార్టీకి దూరంగా ఉంటున్న మండవ వెంకటేశ్వర్లు ఇంటికి కేసీఆర్ స్వయంగా వెళ్లటం.. తనతోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కుమార్.. జూభ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తదితరులతో కలిసి సీఎం కేసీఆర్ సీనియర్ నేత మండవ ఇంటికి వెళ్లటం సంచలనంగా మారింది.

ఎందుకిలా? అన్న ప్రశ్న వేసుకుంటే బోలెడన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని.. కాదంటే రాజ్యసభ పదవి నుంచి ఇస్తానంటూ కేసీఆర్ ఆఫర్ ఇచ్చినా మండవ లైట్ తీసుకున్నారే కానీ.. ఓకే చెప్పింది లేదు. ఇదిలా ఉంటే..తాజాగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో తన కుమార్తె కవిత నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయటం.. ఇదే నియోజకవర్గంలో 185 మంది బరిలో నిలవటం సంచలనంగా మారింది.

పసుపు.. ఎర్రజొన్నలను పండించే రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ తీరుకు నిరసనగా భారీ ఎత్తున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి చూపు పడేలా చేసింది. తన కుమార్తె బరిలో ఉన్న నియోజకరవ్గంలో రైతులు ఈ స్థాయిలో నిరసనకు దిగటంతో సీఎం కేసీఆర్ అలెర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఖమ్మం ఎంపీ స్థానం పరిధిలో ఒక బలమైన సామాజిక వర్గాన్ని తన మాటతో ప్రభావితం చేసే సత్తా ఉన్న మండవ కానీ.. గులాబీ కారు ఎక్కేస్తే.. దాని ప్రభావం కవిత గెలుపు మీద పక్కాగా ఉంటుందన్న వ్యూహంతో ఆయన ఇంటికి వెళ్లారని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బలమైన ముఖ్యమంత్రిగా పేరున్న కేసీఆర్ లాంటి అధినేత.. స్వయంగా తన ఇంటికి రావటం.. వచ్చేటప్పుడు తనతోపాటు మండవ సామాజిక వర్గానికి చెందిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల్ని తీసుకురావటం.. అందరూ కలిసి రావటంతో మండవకు మరో మాటకు అవకాశం లేకుండా పోయినట్లుగా సమాచారం. కేసీఆర్ టార్గెట్ చేయాలే కానీ.. తాను అనుకున్న పనిని పూర్తి చేసేందుకు వెనక్కి తగ్గరన్న విషయం తాజా మండవ ఎపిసోడ్ లో మరోసారి రుజువైందని చెప్పక తప్పదు. ముద్దుల కూతురు గెలుపు కోసం ఒక తండ్రి పడే ఆరాటం.. కేసీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు.