Begin typing your search above and press return to search.

కేసీఆర్ కీర దోస.. ఏపీ మార్కెట్లో

By:  Tupaki Desk   |   25 Jun 2016 11:32 AM GMT
కేసీఆర్ కీర దోస.. ఏపీ మార్కెట్లో
X
తెలంగాణలో అత్యంత భారీగా వ్యవసాయం చేసే ప్రముఖ రైతు ఎవరంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరే చెప్పాలి. మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో భారీ స్థాయిలో పంటలు పండిస్తున్నారు కేసీఆర్. దాని ద్వారా కోట్లు కోట్లు ఆదాయం వస్తున్నట్లు వెల్లడించడమే కాక.. ఆ మధ్య మీడియా ప్రతినిధుల్ని తీసుకెళ్లి తన వ్యవసాయ క్షేత్రమంతా చూపించాడు కూడా. తాజా విశేషం ఏంటంటే.. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో పండుతున్న హైబ్రిడ్ కీర దోసను ఆంధ్రప్రదేశ్ మార్కెట్లకు కూడా తరలించబోతుండటం విశేషం. కేసీఆర్ ఫామ్ హౌస్ లోని పొలాల్లో భారీ స్థాయిలో పండుతున్న యూరోపియన్ వెరైటీ కీరదోసను ఏపీలో మార్కెట్ చేస్తున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ మార్కెట్లో ఈ కేసీఆర్ కీరదోస బాగా ఫేమస్ అయింది. వెజిటబుల్ సలాడ్స్ లో దీన్ని బాగా ఉపయోగిస్తున్నారు. దీని టేస్టు బాగుందన్న పేరు రావడంతో ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల నుంచి కూడా కీరదోసకు డిమాండ్ పెరిగింది. అక్కడి వ్యాపారులు కొందరు ఇప్పటికే కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చెందిన వారితో మాట్లాడారట. విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని నగరాలకు ఈ కీరను తరలించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. మోవైపు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండే క్యాప్సికం.. టమోటో.. అల్లం ఇతర పంటలకు కూడా మంచి పేరుంది. మార్కెట్లో మంచి డిమాండుంది. ఆరోగ్యకరమైన... ఆధునికమైన పద్ధతుల్లో ఇక్కడ పంటలు పండిస్తుండటం.. నాణ్యమైన పంట వస్తుండటంతో మార్కెట్లో వీటికి మంచి డిమాండుంది.