Begin typing your search above and press return to search.

నోటితో నవ్వి.. నొసటితో వెక్కిరిస్తున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   4 Dec 2015 9:21 AM GMT
నోటితో నవ్వి.. నొసటితో వెక్కిరిస్తున్న కేసీఆర్
X
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయం ఏపీ సీఎం చంద్రబాబుకు మింగుడుపడడం లేదు. తాజాగా టీఆరెస్ కొట్టిన దెబ్బకు ఆయన విలవిలలాడుతున్నారు. అంతేకాదు... గొప్ప ఇరకాటంలో కూడా పడిపోయారు. విభజన తరువాత ఇద్దరు సీఎంల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడినా అమరావతి శంకుస్థాపనతో వాతావరణం తేలికపడింది. ఆ కార్యక్రమానికి కేసీఆర్ ను పిలిచి ప్రత్యేక మర్యాదలు చేయడంతో సీను మారింది. అంతేకాదు... మొన్నటి వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక సమయంలోనూ చంద్రబాబు సైలెంటుగా ఉండి టీఆరెస్ కు ఇబ్బంది కలగకుండా చూశారు. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య ఉందని అంతా అనుకున్నారు. ఆ క్రమంలోనే కేసీఆర్ నిర్వహించబోతున్న ఆయుత చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానించనున్నారు కూడా. కానీ, ఇంతలోనే టీడీపీ ఎమ్మెల్యేలను టీఆరెస్ ఎగరేసుకుపోతుండడంతో పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని భావిస్తున్నారు. కేసీఆర్ చంద్రబాబుతో సఖ్యంగా ఉన్నట్లుగా ఉంటూనే టీడీపీ ఎమ్మెల్యేలపై వల వేస్తున్నారు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరిస్తున్నఇలాంటి డబుల్ గేమ్ రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు కేసీఆర్ ఆహ్వానాన్ని మన్నించి యాగానికి అటెండైతే పార్టీ కార్యకర్తలు సహించలేరని... అలా అని వెళ్లకపోతే కేసీఆర్ ఆహ్వానాన్ని తాను మన్నించనట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. దీంతో చంద్రబాబు ఇరకాటంలో పడినట్లయింది.

ఈనెల 23 నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్న చండీయాగానికి ఏపి సీఎం, టిడిపి అధినేత చంద్రబాబునాయుడును స్వ యంగా ఆహ్వానించాలని ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకు న్నట్లు సమాచారం. తనను అమరావతికి ఆహ్వానించిన బాబును చండీయాగానికి పిలవడం గౌరవం, సంస్కారంగా కేసీఆర్ కూడా భావిస్తున్నారు. నిజంగా అదే జరిగితే బాబు నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ ఎమ్మెల్యే సాయన్నను టీఆర్ఎస్‌లో చేర్చుకుని, మరో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌పైనా వల విసురుతున్న కేసీఆర్ నిర్వహించే యాగానికి బాబు హాజరయితే, కార్యక ర్తల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీ నేతలు చెబుతున్నారు. రాజకీ యాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమానికీ సంబంధం లేకపోయినప్పటికీ, ఈ సమయంలో బాబు వెళ్లడం సరైనది కాదని స్పష్టం చేస్తున్నారు. నిజానికి, కేసీఆర్‌ను అమరావతికి పిలిచినప్పుడే తెలంగాణ నేతలు, క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతిందన్న వ్యాఖ్యలు పార్టీలో బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అది ఒకరకంగా కేసీఆర్‌కే ప్లస్ అయిందంటున్నారు. దానికితోడు తామిద్దరు ప్రభుత్వాధినేతలుగా సహకరించుకుంటామని, మీరు ఒక రాజకీయపార్టీ నాయకులుగా ప్రభుత్వంపై పోరాడాలని బాబు చేసిన సూచన కూడా ఎవరికీ రుచించలేదు. ఒకవైపు తాము ప్రభుత్వంపై అక్రమ కేసులు, నిర్బంధాలను ఎదుర్కొని పోరాడుతుంటే, తమ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తోన్న అదే ప్రభుత్వంతో, బాబు సన్నిహితంగా వ్యవహరిస్తుంటే ఇక క్యాడర్‌లో పోరాట స్ఫూర్తి ఎలా కొనసాగుతుందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటుకు నోటు కేసు తర్వాత ఇద్దరు చంద్రుల మధ్య కేంద్రం రాజీ కుదిర్చి, బాబును విజయవాడకే పరిమితం చేసి, ఆ కేసును ముందుకు తీసుకువెళ్లకుండా కేసీఆర్ కాళ్లకు బంధాలు వేసిందన్న ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. దానికి తగినట్లుగానే బాబు నిర్వహించిన పార్టీ సమావేశాల్లో సైతం, మునుపటి మాదిరిగా కేసీఆర్‌పై ఎక్కడా విమర్శ లు కురిపించకపోవడం ఆ వాదనకు మరింత బలం చేకూర్చి నట్టయింది. ఈ క్రమంలో బాబు కేసీఆర్ నిర్వహించనున్న యాగానికి హాజర వ్వాలా? వద్దా అన్న సంకటంలో పడ్డారు. తాను పిలిచిన వెంటనే కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వచ్చారు. మరి అలాంటిది ఆయన నిర్వహించే యాగానికి బాబు వెళ్లకపోతే, ఆయనను అవమానించారన్న అపవాదుతోపాటు, తెలంగాణ ప్రజలను కూడా అవమానించారన్న విమర్శను, టీఆర్ఎస్ నుంచి ఎదుర్కోవలసి రావచ్చు. దీంతో వెళ్తే ఒక బాధ.. వెళ్లకుంటే ఒక బాధ అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. వెళ్తే కార్యకర్తలకు కోపమొస్తుంది.. వెళ్లకపోతే అమరావతికి వచ్చిన కేసీఆర్ ఆహ్వానాన్ని అవమానించినట్లే అవుతుంది.. దీంతో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది.