Begin typing your search above and press return to search.

అర్జెంట్ గా భారీ సభ పెట్టేసే ప్లానింగ్ లో కేసీఆర్

By:  Tupaki Desk   |   18 Jan 2021 3:57 AM GMT
అర్జెంట్ గా భారీ సభ పెట్టేసే ప్లానింగ్ లో కేసీఆర్
X
వరుస ఎదురుదెబ్బలు.. అదే సమయంలో విపక్షాల విమర్శలు.. ఆరోపణలతో గులాబీ జట్టులో కాస్తంత జోష్ తగ్గినట్లుగా వస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో.. వాటన్నింటికి చెక్ చెప్పాలని.. తనలో ఊపు ఏ మాత్రం తగ్గలేదన్న విషయాన్ని రుజువు చేయటంతో పాటు.. గులాబీ సత్తా ఏమిటన్న విషయాన్ని అర్థమయ్యేలా భారీ బహిరంగ సభకు ప్లానింగ్ చేస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఇప్పటికిప్పుడు ఇన్ స్టెంట్ గా ఒక విజయం అత్యవసరమని భావిస్తున్న గులాబీ శ్రేణులకు ఊపునిచ్చేలా.. ఉత్సాహాన్ని పెంచే కార్యక్రమానికి డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.

త్వరలో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండటం.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉండటం.. ఇప్పటికే వరుస విజయాలతో మాంచి ఊపు మీద ఉన్న బీజేపీ.. ఉప ఎన్నికల్లో తన ఉనికిని చాటాలన్న కసితో పని చేస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ క్యాడర్లో జోష్ తెచ్చేలా సభను చేపట్టాలన్న ప్రాథమిక ఆలోచనలోకేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

తన మాటలతో తెలంగాణ సెంటిమెంట్ ను ఇట్టే రగిల్చే సత్తా ఉన్న కేసీఆర్.. తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాన్ని సంధించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహిస్తూ.. నిర్వహణ భారాన్ని రైతుల నెత్తిన వేయటం.. విద్యుత్ ఉత్పత్తికి నీటి నిల్వ పేరుతో సాగర్ కుడి కాల్వ ద్వారా దొంగచాటుగా క్రిష్ణా జలాల్ని తరలించుకుపోయే వైనాన్ని తప్పుపడుతూ.. 2003లో కోదాడ నుంచి హాలియా వరకు కేసీఆర్ పాదయాత్ర చేసిన వైనాన్ని గుర్తు చేస్తూ తా జాగా జరిగే ఉప ఎన్నికల్లో ప్రముఖంగా ప్రస్తావించాలని భావిస్తున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో ‘సాగర్’ సెంటిమెంట్ ను తెర మీదకు తేవాలని భావిస్తున్నారు.

ఇంతకాలం.. సరైన ప్లానింగ్ లేక..మితిమీరిన ధీమాతో వరుస ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలాయని భావిస్తున్న టీఆర్ఎస్ అగ్రనాయకత్వం.. ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకోకూడదన్న పట్టుదలతో గులాబీ బాస్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా సాగర్ ఆయుకట్టకు క్రిష్ణా నది నుంచి నీటిని ఎత్తిపోయటం ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయుకట్ట చివరి భూముల్ని సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన ఎత్తిపోతల పథకానికి ఈ నెలాఖరులో శంకుస్థాపన.. అదే సమయంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నారు. ఈ సభకు నాలుగు నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయటం ద్వారా.. టీఆర్ఎస్ తన సత్తా చాటాలన్న ఆలోచనలో ఉంది. మరి.. దీనికి కౌంటర్ గా విపక్షాలు ఎలాంటి ప్లాన్లు వేస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.