Begin typing your search above and press return to search.

టీచర్లకు ఎసరు పెడుతున్న కేసీఆర్ సర్కార్?

By:  Tupaki Desk   |   19 April 2023 8:00 PM GMT
టీచర్లకు ఎసరు పెడుతున్న కేసీఆర్ సర్కార్?
X
అధికారంలో ఉన్న తమను ఎదురిస్తే ఎలాంటి చర్యలకైనా వెనుకాడమని కేసీఆర్ సర్కార్ నిరూపించేందుకు రెడీ అవుతోంది. మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన వ్యక్తికి కాదని బీజేపీ సపోర్టు చేసిన వ్యక్తిని ఉపాధ్యాయులు గెలిపించారు. ఇందుకు ప్రతికారంగా వారి విషయంలో కఠినంగా ఉండబోతుంది. టీచర్ల హాజరు విషయంపై ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు అందాయి. కానీ ఇంతకాలం వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ లేటేస్టుగా వీరి హాజరు విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు ప్లాన్ వేస్తోంది. ప్రతి ఒక్క టీచర్ హాజరయ్యేందుకు పక్కా ప్లాన్ వేస్తోంది.

ప్రభుత్వ టీచర్లపై పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కొన్ని స్కూళ్లల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కానీ సాంకేతిక సమస్యలతో అవి పనిచేయడం లేదు. దీనికి బదులు ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అవకతవకలు జరగవని ఆలోచిస్తున్నారు. అయితే ఈ విధానాన్ని ఇప్పటికే ఢిల్లీ, ఏపీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టడంతో అక్కడ విమర్శలు వచ్చాయి. ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా తమ పర్సనల్ డేటా చోరీ అవుతుందని కొందరు భావిస్తే.. అటెండెన్ష్ సమయంలో మిషన్లు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని ఆందోళన చేశారు. ఇప్పుడు తెలంగాణ ఉపాధ్యాయులు కూడా ఫేస్ రికగ్నైషన్ విధానంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

ఫేస్ రికగ్నైషన్ విధానాన్ని ముందుగా రంగారెడ్డి, మేడ్జల్ జిల్లాలో అమలు చేయనున్నారు. ఇక్కడ సక్సెస్అయితే ఇతర జిల్లాల్లో ప్రవేశపెడుతారు. దీని వినియోగంపై కొందరు అధికారులకు పూర్తిగా శిక్షణ ఇవ్వనున్నారు. అయితే అంతకంటే ముందే టీచర్లకు సంబంధించిన డేటాను సేకరించనున్నారు. వారి ఫొటోలు, డేటాను సేకరించి సిస్టమ్ లో అప్లోడ్ చేస్తారు. అయితే పనిచేస్తున్న స్కూల్ యూ డైస్ కోడ్, ఐడీ నంబర్ తదితర వివరాలు పెట్టనున్నారు. ఫేస్ రికగ్నైషన్ విధానాన్ని టీచర్లు సొంతంగా ఉపయోగించనున్నారు.

ముందుగా దీనికి సంబంధించిన యాప్ ను డౌన్లోడ్ చేసుకొని తరగతి గదికి వెళ్లిన తరువాత అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. పది సెకన్ల పాటు ఈ అటెండెన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఆ స్కూల్ లో పనిచేసే సంబంధిత అధికారి అటెండెన్ష్ వివరాలు తీసుకొని యాప్ లో నమోదు చేస్తారు.

ఈ విధానాన్ని ఇప్పటికే ఏపీలో అమలు చేశారు. ఇందులో టెక్నికల్ సమస్యలు ఎదురు కావడంతో ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. అటెండెన్స్ సమయంలో యాప్ పనిచేయకపోయినా.. సర్వర్ బిజీగా ఉన్నా తమ టైమింగ్స్ లో తేడాలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అలాగే ఒక్కోసారి ఇవి తప్పుగా నమోదవుతే బాధ్యులు ఎవరన ప్రశ్నించారు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా అవే సమస్యలు వస్తాయా? అని చర్చించుకుంటున్నారు.

అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మదేళ్లు అవుతున్నా పాఠశాలలో నెలకొన్న సమస్యలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా టీచర్ల హాజరుపై ఇప్పటికే వేలకొద్ది ఫిర్యాదులు వచ్చినా వాటిని పక్కనపడేసింది. అయితే ఇప్పుడే ఎందుకు ఈ విధానాన్ని అమలు చేయాల్సి వస్తోందని కొందరు చర్చించుకుంటున్నారు. గత మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకే వారిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారని కొందరు అనుకుంటున్నారు.