Begin typing your search above and press return to search.

నిర‌స‌న‌లు రావొద్ద‌ని....8792 ఉద్యోగాలిస్తున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   11 Oct 2017 5:55 AM GMT
నిర‌స‌న‌లు రావొద్ద‌ని....8792 ఉద్యోగాలిస్తున్న కేసీఆర్‌
X
``తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రభుత్వ, జిల్లాపరిషత్తు, మండలపరిషత్తు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి తుది ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన టీచర్ రిక్రూట్‌ మెంట్ టెస్ట్ (టీఆర్టీ) మార్గదర్శకాలను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ కు పంపించారు. పదిరోజుల్లోగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీఎస్‌ పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. దీంతో అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ``ఇది తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి, టీఆర్ ఎస్ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న ప్ర‌చారం.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉద్యోగాల భ‌ర్తీకి కీల‌క ముంద‌డుగు వేశార‌ని చేస్తున్న ప్ర‌చారం. అయితే 8,792 టీచ‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి కేసీఆర్ ఆమోదం తెలుప‌డం వెనుక భారీగానే లెక్క‌లు ఉన్నాయంటున్నారు. రాజ‌కీయ‌, ప‌రిపాల‌నప‌ర‌మైన అంశాల‌తో పాటుగా కోర్టు కేసుల‌ను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవలే డీఎస్సీ వేయకపోతే ప్రపంచం మునుగుతుందా?అని ప్రశ్నించిన సీఎం ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల పర్యటన నేపథ్యంలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతాయని భావించడంతో పోస్టుల భర్తీకి పూనుకున్నార‌ని అంటున్నారు. ఇంకోవైపు ఈనెల 28న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై సుప్రీం కోర్టులో విచారణ ఉంది. ఈ విచారణకు విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య హాజరు కావాల్సిన ఉన్న విషయం తెలిసిందే. సుప్రీం కోర్టులో సమాధానం చెప్పేందుకే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఈనెల 31న హైదరాబాద్‌ లో కొలువులకై కొట్లాట కార్యక్రమాన్ని టీజేఏసీ చైర్మెన్‌ కోదండరామ్‌ చేపడతామని ప్రకటించారు. ఇదే అంశంపై సీపీఎం రాష్ట్ర కమిటీ చర్చించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేసింది. లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పూనుకుంటామని హెచ్చరించింది. కాగా, ఈనెల 23వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశముంది. ఈ సంద‌ర్భంగా స‌హ‌జంగానే ప్రతిపక్షాల నుంచి గ‌ట్టి నిర‌స‌న‌, వ్యతిరేకత వస్తుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకే సర్కారు మొగ్గు చూపిందన్న చర్చ జరుగుతోంది.