Begin typing your search above and press return to search.

తల పట్టుకునోటోళ్లనే తనదిక్కు తిప్పుకున్నకేసీఆర్

By:  Tupaki Desk   |   4 Jan 2016 4:53 AM GMT
తల పట్టుకునోటోళ్లనే తనదిక్కు తిప్పుకున్నకేసీఆర్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత తెలివైన వారన్న విషయం తాజాగా ఆయన తీసుకున్న ఒక నిర్ణయాన్ని చూస్తే తెలుస్తోంది. ఇప్పటివరకూ చాలామంది ముఖ్యమంత్రుల్నే చూశారు. కానీ.. తెలంగాణ ముఖ్యమంత్రి లాంటోడిని మాత్రం ఎవరూ చూడలేదనే చెప్పాలి. ఏదైనా అంశానికి సంబంధించి ఎవరో ఒకరు డిమాండ్ చేసి.. దాన్ని రాజకీయం చేస్తే కానీ పట్టించుకోని నేతలకు భిన్నంగా.. తనకు తానుగా స్పందించి.. ఒక వర్గం వారి అవసరాలు గుర్తించి.. వారు నోరు తెరిచి అడగకముందే వరాలు ఇచ్చేయటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతుంది.

తాజాగా ఆయన సెలూన్ షాపులకు ఒక వరాన్ని ప్రసాదించారు. వారి విద్యుత్తు బిల్లుల్ని కమర్షియల్ స్లాబ్ నుంచి మినహాయించి.. డొమెస్టిక్ లోకి మార్చనున్నారు. దీని వల్ల ప్రభుత్వం మీద పడే భారం కాస్త అటూ ఇటూగా రూ.50కోట్లు కూడా ఉండదు. దాదాపు రూ.1.20లక్షల కోట్ల తెలంగాణ వార్షిక బడ్జెట్ లో రూ.50కోట్ల మొత్తం అస్సలు విషయమే కాదు. అదే సమయంలో కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఆషామాషీ కాదనే చెప్పాలి. వందలాది కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తే కూడా రాని రాజకీయప్రయోజనాన్ని కేవలం రూ.50కోట్లు కూడా ఏడాదికి ఖర్చు పెట్టకుండానే పొందటం చిన్న విషయం కాదు.

మిగిలిన వ్యాపారాలకు.. సెలూన్ వ్యాపారానికి మధ్య వ్యత్యాసం ఎక్కువే. ప్రతిఒక్క వినియోగదారుడితో సెలూన్ యజమానికి ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి. పల్లెలు మొదలు.. మహా నగరాల వరకూ వినియోగదారుడితో ప్రత్యక్ష పరిచయంతో పాటు.. వారితో కాసేపు మాటలు కలిపే అవకాశం సెలూన్లకు ఎక్కువే ఉంటుంది. ఏ సందర్భంలోనూ వదలకుండా ఉండే సెల్ ఫోన్ ను సైతం.. సెలూన్ లో వాడలేని పరిస్థితి. కటింగ్.. షేవింగ్ చేయించుకునే సమయంలో కత్తెరకు పని చెప్పే వారి మాటల మీద ఎంతోకొంత ఫోకస్ ఉంటుంది.

తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని సెలూన్ షాపు యజమానులు లబ్థి పొందటం ఖాయం. అదే జరిగితే.. తాము కోరుకోకుండానే వరం ఇచ్చేసిన కేసీఆర్ ను వారు అంత త్వరగా మర్చిపోరు. తమ అభిమానాన్ని ప్రకటించటం ఖాయం. కరెంటు బిల్లులపై ప్రయోజనాన్ని ప్రతి నెలా ప్రయోజనం పొందే పరిస్థితుల్లో కేసీఆర్ సర్కారు నిర్ణయాన్ని మర్చిపోలేరు. తనకు కలిగిన ప్రయోజనాన్ని తెలంగాణ సర్కారు మీద అభిమానంగా మారితే.. తిరుగు ఉండదు. అదే జరిగితే.. సెలూన్లు తెలంగాణ సర్కారుకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారటం ఖాయం. కొద్దిపాటి నిధులతో.. ఒక వర్గానికి చెందిన వారందరి మనసుల్ని దోచుకునే తీరు చూస్తే.. కేసీఆర్ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేం.