Begin typing your search above and press return to search.

రూ.100 కోట్లు కాదు రూ.500 కోట్లు.. కేసీఆర్ తోని అట్లుంటది

By:  Tupaki Desk   |   16 Feb 2023 10:22 AM GMT
రూ.100 కోట్లు కాదు రూ.500 కోట్లు.. కేసీఆర్ తోని అట్లుంటది
X
వరాల దేవుడిగా ఒకప్పుడు డైలీ బేసిస్ లో వరాల వర్షం కురిపించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తానిచ్చిన వరాలను ఆర్థికంగా అడ్జెస్ట్ చేయటానికి కిందా మీదా పడిపోయిన వైనాన్ని గుర్తించి..కాస్తంత తగ్గిన వైనం తెలిసిందే. ఆయనప్పటికి పాత వాసనలు పూర్తిగా పోవు కదా? ఆయన నోటి నుంచి ఎప్పుడు ఎలాంటి ప్రకటన వస్తుందో అస్సలు ఊహించలేని పరిస్థితి. ఏదైనా ఇష్యూ మీద ఆయన ఫోకస్ పెట్టటం మొదలు పెట్టారంటే చాలు.. దాని లెక్క తేల్చే వరకు నిద్రపోని వైనం ఆయనలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది.

తాజాగా అలాంటి ఉదంతమే మరోసారి రిపీట్ అయ్యింది. మొన్నటివరకు యాదాద్రి జపం చేసిన ఆయన ఈ మధ్యన కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం రూపురేఖల్ని మార్చటమే లక్ష్యమన్నట్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని డెవలప్ చేసేందుకు ఈ మధ్యన బడ్జెట్ లో రూ.100 కోట్ల ప్రకటన చేసిన ఆయన.. తాజాగా ఆ క్షేత్రాన్ని దర్శించేందుకు హెలికాఫ్టర్ వేసుకొని మరీ వెళ్లటం.. ఏరియల్ వ్యూ సర్వే చేయటం లాంటివి చేసేశారు.

నిజానికి కేసీఆర్ పర్యటనకు ముందే.. టాలీవుడ్ కళాదర్శకుడు ఆనంద్ సాయిని పంపిన వైనం తెలిసిందే. హెలికాఫ్టర్ లో ఏరియల్ సర్వే నిర్వహించి.. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో కొండగట్టు దేవాలయానికి వెళ్లిన కేసీఆర్ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ డెవలప్ మెంట్ కోసం రివ్యూ చేపట్టారు. ఏదైనా విషయానికి తాను ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని తనదైన శైలిలో చెప్పటం కేసీఆర్ కు అలవాటు.

అలానే కొండగట్టు ఆలయ డెవలప్ మెంట్ విషయంలోనూ అదే తీరును ప్రదర్శించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా అధికారులతో రివ్యూ నిర్వహించిన కేసీఆర్.. ఏకంగా రెండు గంటల పాటు ఏమేం చేయొచ్చు? ఏమేం చేయాలన్న అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అక్కడితో ఆగకుండా.. మొన్నీమధ్యనే రూ.100 కోట్లు ప్రకటించిన దానికి భిన్నంగా మరోరూ.400 కోట్లు కలిపి ఏకంగా రూ.500 కోట్ల మొత్తాన్ని కొండగట్టు టెంపుల్ కోసం ప్రకటిస్తున్నట్లుగా పేర్కొంటూ ప్రకటన చేశారు. ఇదంతా చూసినోళ్లు కేసీఆర్ మజాకానా? అన్న భావన వ్యక్తం కాక మానదు.

2018ఎన్నికల సమయంలో యాదాద్రి దేవాలయ డెవలప్ మెంట్ ఎజెండాను ముందుకు పెట్టిన కేసీఆర్.. మరికొద్ది నెలల్లో తెలంగాణలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. కొండగట్టు అంజన్న దేవాలయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం.. వందల కోట్లను కేటాయించటం చూస్తుంటే.. రానున్న రోజుల్లో కొండగట్టు కేంద్రంగా కేసీఆర్ మార్కు హడావుడి మొదలయ్యే వీలుందన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.