Begin typing your search above and press return to search.

సాగునీటిపై కేసీఆర్ పిల్లిమొగ్గలు

By:  Tupaki Desk   |   8 Sep 2015 6:21 PM GMT
సాగునీటిపై కేసీఆర్ పిల్లిమొగ్గలు
X
సాగునీటి విషయంలో సీమాంధ్రులు దోపిడీ చేశారని తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ఆరోపించాడు. దానిని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రచారం చేశారు. తెలంగాణ వాదులంతా దానిని నమ్మారు. సీమాంధ్రులపై ఆరోపణలు చేశారు కనక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మార్పులు చేయాలి. మార్పులు చేస్తేనే గతంలో తాము చేసిన ఆరోపణలు నిలుస్తాయి. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీ డిజైన్ కు పూనుకున్నారు. కానీ, అక్కడ కూడా ఆయనకు ఎదురు దెబ్బే తగులుతోంది.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించాలని వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్ణయించారు. దానికి ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని భావించారు. ఆ మేరకే పనులు ప్రారంభించారు. ప్రపంచంలో ఏ ప్రాజెక్టును నిర్మించాలన్నా ముంపు, నిర్వాసితులు తప్పవు. కానీ, అవి ఉండకూడదనే సాకుతో ప్రాణహితలో మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. తుమ్మిడిహెట్టి కాదని దాని కింద మేడిగడ్డ అన్నారు. మేడిగడ్డ కూడా ఇబ్బందులు వస్తాయని దానిని కూడా వద్దనుకుంటున్నారు. ఇప్పుడు ఇచ్చంపల్లి దిగువన బ్యారేజీ నిర్మించాలని భావిస్తున్నారు. ఇచ్చంపల్లిని కూడా ఖరారు చేస్తారో లేదో తెలియని అయోమయ పరిస్థితి. ఏడాదిన్నరగా ఇదే పరిస్థితి.

కానీ, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని వైఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అది కూడా వ్యాప్కోస్ నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకుంది. తుమ్మిడిహట్టి దగ్గర ఒక బ్యారేజీ నిర్మించి.. మరో బ్యారేజీని ఇచ్చంపల్లి దగ్గర నిర్మించాలని భావించింది. దానిని తప్పుబట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు పిల్లి మొగ్గలు వేస్తూ తుమ్మడి హెట్టి కాదంది. మేడిగడ్డ కాదంది. తాజాగా ఇచ్చంపల్లి అంటోంది. ఇక, కంతానపల్లి విషయంలోనూ ఇదే పిల్లిమొగ్గ. తొలుత కంతానపల్లి వద్దన్నారు. దానిని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తీరా ప్రతిపక్షాలు ఉద్యమం చేశాయి. ఆ తర్వాత కంతానపల్లిని పునరుద్ధరించారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కనక దీనిని పునరుద్ధరిస్తున్నామని చెప్పుకొన్నారు. కానీ, వాస్తవం ఇందుకు పూర్తి భిన్నం కంతానపల్లి దగ్గర తప్పితే మరొకచోట బ్యారేజీ నిర్మించే అవకాశం లేదు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, తెలంగాణ ప్రభుత్వం కంతానపల్లిని కూడా దాని ప్రాణం తీసేసి నిర్మించడానికి జీవో జారీ చేసింది. అదే విచిత్రం..