Begin typing your search above and press return to search.

నీళ్ల గురించే ఎక్కువ ఫోక‌స్ పెట్టిన కేసీఆర్

By:  Tupaki Desk   |   26 May 2019 6:30 AM GMT
నీళ్ల గురించే ఎక్కువ ఫోక‌స్ పెట్టిన కేసీఆర్
X
టీఆర్ఎస్ అధినేత‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇంటికి ఏపీకి కాబోయే కొత్త ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌చ్చారు. దాదాపు గంట‌న్న‌ర‌కు పైనే కేసీఆర్ ఇంట ఉన్న జ‌గ‌న్ ఆ త‌ర్వాత త‌న నివాస‌మైన లోట‌స్ పాండ్ కు వెళ్లారు. ఇరువురు అగ్ర‌నేత‌ల స‌మావేశంలో కేసీఆర్ ఫోక‌స్ మొత్తం నీళ్లు.. ప్రాజెక్టుల మీద‌నే ఉండ‌టం స్ప‌ష్టంగా క‌నిపించ‌క మాన‌దు.

ఎప్ప‌టిలానే.. మీటింగ్ లో కేసీఆర్ లీడ్ తీసుకొని.. రెండు రాష్ట్రాల మ‌ధ్య చ‌క్క‌టి సంబంధాల గురించి ప్ర‌స్తావిస్తూ.. తాను ఇరుగుపొరుగు రాష్ట్రాల విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించేది చెప్పారు. మ‌హారాష్ట్రకు వెళ్లి అక్క‌డి ప్ర‌భుత్వంతో తాను చేసుకున్న ఇరిగేష‌న్ ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చారు. గోదావ‌రి.. కృష్ణా న‌దీ జ‌లాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకోవాల‌న్న ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ కు కొన్ని స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

రెండు న‌దీజ‌లాల‌తో రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయ‌ని.. కాకుంటే రెండు న‌దీజ‌లాల్ని స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకోవాల‌ని ఆయ‌న కోర‌టం గ‌మ‌నార్హం. ఇరిగేష‌న్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే సంద‌ర్భంలో రాయ‌ల‌సీమ స‌స్య‌శ్యామ‌లం కావాల‌న్న ఆకాంక్ష‌ను కేసీఆర్ వ్య‌క్తం చేయ‌టం ద్వారా జ‌గ‌న్ లో ఇంట్ర‌స్ట్ పెంచేలా మాట్లాడార‌ని చెప్పాలి.

ద‌శాబ్దాలుగా మ‌హారాష్ట్రతో ఉన్న జ‌ల వివాదాల కార‌ణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవ‌టంతో తానే చొర‌వ తీసుకొని మాట్లాడాన‌ని.. బ‌త‌కాలి.. బ‌త‌క‌నివ్వాల‌న్న‌దే త‌మ విధానంగా స్ప‌ష్టం చేసిన కేసీఆర్ మాట‌ల ప‌ర‌మార్థం ఇరు రాష్ట్రాల మ‌ధ్య నీళ్ల పంచాయితీ విష‌యంలో చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాల‌న్నట్లుగా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి త‌గ్గ‌ట్లే కేసీఆర్ చెప్పిన ఉదాహ‌ర‌ణ కూడా అదే తీరులో ఉండ‌టం గ‌మ‌నార్హం.

గోదావ‌రి నుంచి ఏటా 3500 టీఎంసీల నీళ్లు స‌ముద్రంలో క‌లుస్తున్నాయ‌ని.. తెలంగాణ గ‌రిష్ఠంగా 700-800 టీఎంసీల నీటిని మాత్ర‌మే వాడుకోగ‌ల‌ద‌ని చెప్పిన కేసీఆర్‌.. మిగిలిన నీటిని ఏపీనే వాడుకోగ‌ల‌ద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. కేసీఆర్ మాట‌ల్ని నిశితంగా చూస్తే.. ఏపీ సాగునీటి ప్రాజెక్టుల అలైన్ మెంట్ తోపాటు.. డిజైన్ లోనూ మార్పులు సూచించే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో.. స‌ముద్రంలో క‌లిసే నీటిని ఎలా వాడుకోవ‌చ్చ‌న్న విష‌యానికి సంబంధించి జ‌గ‌న్ కు ఒక స‌ల‌హా ఇవ్వ‌టం క‌నిపిస్తుంది. ప్ర‌కాశం బ్యారేజి ద్వారా సోమ‌శిల వ‌ర‌కు గ్రావిటీతో గోదావ‌రి నీటిని పంపించొచ్చు అంటూ చెప్పిన కేసీఆర్.. ఆ ప‌ని కానీ చేస్తే రాయ‌ల‌సీమ మొత్తం స‌స్య‌శ్యామ‌లం అవుతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. మ‌రి..కేసీఆర్ స‌ల‌హాల్ని జ‌గ‌న్ అమ‌లు చేస్తారా? ఏం చేయ‌నున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌ర అంశంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.