Begin typing your search above and press return to search.

కేసీఆర్ మంత్రివర్గంలోకి కొత్తగా వచ్చేది వీరే?

By:  Tupaki Desk   |   18 Jan 2018 4:28 AM GMT
కేసీఆర్ మంత్రివర్గంలోకి కొత్తగా వచ్చేది వీరే?
X
తెలంగాణ రాష్ర్ట కేబినెట్‌ ను సీఎం కేసీఆర్ పునర్వ్యవస్థీకరించనున్నారా... అది గురు - శుక్రవారాల్లోనే పూర్తి చేయడానికి ఆయన సిద్ధమయ్యారా అంటే అవుననే అంటున్నాయి టీఆరెస్ వర్గాలు. అంతేకాదు... కేబినెట్ నుంచి ఎవరిని తప్పిస్తారు, ఎవరిని తీసుకుంటారన్నది కూడా పలువురు టీఆరెస్ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. టీఆరెస్ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది. పైగా గురు - శుక్రవారాల్లో హైదరాబాద్‌ లో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చినట్లు స్వామిగౌడ్ కూడా ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ధ్రువీకరించారు. అయితే... కారణమేంటన్నది మాత్రం తనకు తెలియదంటూ ఆయన దాటవేశారు.

బుధవారం సొంత నియోజకవర్గం గజ్వేల్‌ లో పర్యటించి - అక్కడే ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేసిన కేసీఆర్ రాత్రికల్లా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు రావడం ఖాయమని కచ్చితమైన అంచనాలతో ఉన్న కేసీఆర్ అందుకుగాను తగిన మార్పులు చేర్పులు చేసుకుంటూ సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రాష్ర్టవ్యాప్తంగా ప్రభావం చూపగలిగే నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఎన్నికల నాటికి వారికి కొంత సమయం కూడా ఉంటేనే వారు ప్రభావితం చేయగలరన్న ఉద్దేశంతో తక్షణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు దిగుతున్నట్లు తెలుస్తోంది.

* ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల్లో గట్టి పట్టున్న స్వామిగౌడ్‌ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని.. ఆయన కోసం పద్మారావు గౌడ్‌ ను పక్కనపెడతారని తెలుస్తోంది.

* అలాగే నాయిని నరసింహారెడ్డిని తప్పించి ఆయన స్థానంలో పద్మాదేవేందర్ రెడ్డి లేదా - ఉమామాధవరెడ్డిలను తీసుకోవచ్చని సమాచారం. నల్గొండలో బలం పెంచుకునేందుకు ఉమామాధవరెడ్డిని తీసుకోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈసారి బడ్జెట్లో తొలిసారి మహిళా బడ్జెట్ ప్రవేశపెడుతుండడంతో అది కూడా మహిళా మంత్రి చేతుల మీదుగా ప్రవేశపెట్టించే ఉద్దేశంతో కచ్చితంగా ఒక మహిళను మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది.

* మంత్రి చందూలాల్‌ ను తప్పించి ఆయన స్థానంలో రెడ్యానాయక్‌ ను తీసుకునే అవకాశాలున్నాయి.

* ఇక స్వామిగౌడ్‌ ను మంత్రిని చేస్తే శాసనమండలి చైర్మన్‌ గా ఆయన స్థానంలో పాతూరి సుధాకరరెడ్డిని నియమించొచ్చని సమాచారం.