Begin typing your search above and press return to search.

ఓటుకు నోటులో ఏ-1 బాబేన‌ని కేసీఆర్ తేల్చారా?

By:  Tupaki Desk   |   8 May 2018 5:41 AM GMT
ఓటుకు నోటులో ఏ-1 బాబేన‌ని కేసీఆర్ తేల్చారా?
X
నిద్ర లేచింది మొద‌లు త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న త‌ప్పుల్ని అస్స‌లు గుర్తు పెట్టుకోరు. గురివింద సామెత‌కు త‌గ్గ‌ట్లే ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి ఉంటుంది. తాజాగా ఆ విష‌యాన్ని గుర్తు చేసేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి. మూడేళ్ల క్రితం తెర మీద‌కు వ‌చ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ అల‌జ‌డిని రేపిన ఓటుకు నోటు వ్య‌వ‌హారం మ‌రోసారి తెర మీద‌కు వ‌చ్చింది.

ఎవ‌రి అంచ‌నాల‌కు దొర‌క‌ని రీతిలో కేసీఆర్ క‌దిపిన పావులు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇంత‌కాలం ఓటుకు నోటు కేసు మీద మౌనంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉన్న‌ట్లుండి పోలీసు అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఓటుకు నోటు కేసు ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింద‌న్న కేసీఆర్ మాట‌కు.. పోలీసు అధికారులు స్పందిస్తూ.. ఈ కేసులో చంద్ర‌బాబును ఏ-1 నిందితుడిగా పేర్కొనాల్సి ఉంటుంద‌న్న విష‌యాన్ని కేసీఆర్ దృష్టికి తెచ్చిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు పోలీసు.. న్యాయ‌శాఖ ఉన్న‌తాధికారులతో స‌మీక్షించిన కేసీఆర్ తీరు రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపింది. మూడేళ్ల క్రితం జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తాము సూచించిన అభ్యర్థికి ఓటు వేసేందుకు వీలుగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్ కు ముడుపులు ముట్ట‌జెప్పే ప్ర‌య‌త్నం చేయ‌టం.. ఆ విష‌యాలు బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే.

మూడేళ్లుగా స్త‌బ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసు మ‌రోసారి తెర మీద‌కు రావ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ముడుపుల వ్య‌వ‌హారానికి క‌ర్త‌.. క‌ర్మ‌.. క్రియ అంతా బాబేన‌న్న వాద‌న ఉంది. అప్ప‌ట్లో కెమేరాకు చిక్కిన నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ఒక పావు మాత్ర‌మేన‌ని.. వెన‌కుండి న‌డిపించిందంతా చంద్ర‌బాబేన‌న్న ప్ర‌చారం సాగింది. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి అవినీతి నిరోధ‌క శాఖ ఇప్ప‌టికే రెండు చార్జిషీట్ల‌ను దాఖ‌లు చేశారు. ఇందులో ఒక‌టి బాబుకు సంబంధించింద‌ని చెప్పే ఆడియో టేప్‌. దీన్ని ప‌రిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు .. ఆడియో టేప్ లో ఉన్న‌ది బాబు గొంతేన‌ని తేల్చిన‌ట్లు చెబుతున్నారు. ఈ నివేదిక వ‌చ్చిన నేప‌థ్యంలో బాబును ఈ కేసులో నిందితుడిగా పేర్కొనే అవ‌కాశం ఉందంటున్నారు. దీంతో.. ఒక్క‌సారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.