Begin typing your search above and press return to search.

కేసీఆర్ రాజసమేమో కానీ హైదరాబాదీలకు చుక్కలే

By:  Tupaki Desk   |   28 Jun 2023 9:27 AM GMT
కేసీఆర్ రాజసమేమో కానీ హైదరాబాదీలకు చుక్కలే
X
రెండు రోజుల పాటు మహారాష్ట్రలో బీఆర్ఎస్ రాజకీయ కార్యకలాపాల్లో బిజీబిజీగా గడిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మంగళవారం సాయంత్రం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరటం తెలిసిందే. హైదరాబాద్ నుంచి షోలాపూర్ వెళ్లేందుకు 600 కార్ల భారీ కాన్వాయ్ తో వెళ్లిన ఆయన.. తిరిగి వచ్చేటప్పుడు కూడా రోడ్డు మార్గంలోనే తిరిగి రావటం గమనార్హం.

హైదరాబాద్ మహానగరంలో.. బీహెచ్ఈఎల్ చౌరస్తాకు దాదాపు 10.10 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. సాధారణంగా ఈ సమయంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే దూరప్రాంతాలకు చెందిన వందలాది ప్రైవేటు బస్సులు ఉంటాయి. వీటిల్లో ప్రయాణించేందుకు వందలాది మంది ప్రయాణికులు.. వారికి సెండాఫ్ ఇవ్వటానికి పెద్దఎత్తున ప్రజల ఉంటారు.

దీంతో బీహెచ్ఈఎల్ నుంచి హయత్ నగర్ వరకు ఈ రద్దీ నడుస్తూనే ఉంటుంది. సరిగ్గా.. బస్సులు తిరిగి వెళ్లే టైంకు సీఎం కేసీఆర్ భారీ కాన్వాయ్ హైదరాబాద్ లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో.. అన్ని ప్రైవేటు బస్సులకు కనిష్ఠంగా 45 నిమిషాలు గరిష్ఠంగా గంటన్నర పాటు నిలిపేశాయి. నిజానికి 9-30 నుంచి 11 గంటల మధ్యలో చందానగర్ మొదలుకొని కూకట్ పల్లి వరకు ఎంత భారీగా రద్దీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అలాంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రోడ్ల మీదకు తన భారీ కాన్వాయ్ తో రావటం.. దానికి అనుగుణంగా పోలీసు అధికారులు చేపట్టిన భారీ ఏర్పాట్లతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒకవైపు సీఎం కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ క్లియరెన్సు కోసం ముందు నుంచే రోడ్లమీద వెళ్లే వాహనాల్ని అరగంట కంటే ముందే నియంత్రించటం.. రోడ్ల మీద ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

భారీ వాహనాలతో కేసీఆర్ కాన్వాయ్ హైదరాబాద్ రోడ్ల మీద తక్కువలో తక్కువ గంటకు 90-100 కి.మీ. వేగంతోదూసుకెళ్లాయి. ఆ రద్దీ రోడ్ల మీద సరాసరి వేగం కేవలం 30-35 కి.మీ. మాత్రమే. కాకుంటే.. గ్రీన్ ఛానల్ మాదిరి.. కనుచూపు మేర (దగ్గర దగ్గర 5-7కి.మీ) ఖాళీ రోడ్డు తప్పించి.. ఇంకేమీ కనిపించని పరిస్థితి.

అంటే.. అంతలా ట్రాఫిక్ ను నియంత్రించారన్నమాట. కేసీఆర్ కాన్వాయ్ వెళ్లిపోయిన తర్వాత ఆలస్యంగా వచ్చిన ప్రైవేటు బస్సులతో పాటు.. ట్రాఫిక్ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో.. ప్రయాణికులు.. వారి కుటుంబ సభ్యులు.. వాహనదారులకు చుక్కలంటే చుక్కలు కనిపించిన పరిస్థితి. కేసీఆరా మజాకానా అన్న విషయాన్ని మరింత తెలిసేలా చేశారంతే.