Begin typing your search above and press return to search.

కేసీఆర్ కరాఖండి వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయంలో మలుపు?

By:  Tupaki Desk   |   7 Oct 2019 6:24 AM GMT
కేసీఆర్ కరాఖండి వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయంలో మలుపు?
X
చాలా చిన్న అంశాలుగా కనిపించొచ్చు. కానీ.. కాలం కలిసి రాకుంటే.. అవే పెద్దవిగా మారి.. మహోద్రగ రూపాన్ని దాల్చటమే కాదు.. ఊహించిన పరిణామాలకు కారణమవుతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే తెలంగాణలో నెలకొని ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఒక్క వేటుతో తీసేస్తున్నట్లుగా సంచలన వ్యాఖ్య చేశారు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటం ఆలస్యం.. అందరి సమస్యలు తీరిపోతాయని.. ఎవరూ ఉద్యమాలంటూ రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉండదని.. నిరసనలతో తల్లడిల్లాల్సిన పరిస్థితే ఉండదంటూ ఉద్యమ నేత హోదాలో కేసీఆర్ చెప్పిన మాటలకు.. రాష్ట్రాధినేత హోదాలో ఆయన తీసుకున్న నిర్ణయం ఒక పట్టాన మింగుడు పడని రీతిలో మారిందని చెప్పక తప్పదు.

తనను కాదని ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై కేసీఆర్ ఎంత కోపంతో ఉన్నారన్నది ఆయన తీసుకున్న నిర్ణయం చూస్తేనే అర్థం కాక మానదు. భవిష్యత్తులో క్రమశిక్షణా రాహిత్యాన్ని.. బ్లాక్ మొయిల్ విధానం శాశ్వితంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోందని.. ఇందులో భాగంగా విదులకు హాజరు కాని వారిని తిరిగి విధుల్లోకి తీసుకోమని.. గడప దాటితే బయటికే.. మళ్లీ గడపలోకి రానిచ్చే సమస్యే లేదని తేల్చేసిన కేసీఆర్ కటువైన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

దసరా పండుగ వేళ.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో తానెంత కటువుగా.. కఠినంగా ఉండనున్నాన్న విషయాన్ని సూటిగా చెప్పేశారు. ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె విషయంలో తానేం చేయనున్నాన్న విషయాన్ని ఆదివారం రాత్రి వేళ.. ఒక భారీ నోట్ రూపంలో విడుదల చేసిన కేసీఆర్ తీరు చూస్తే.. ఈ పరిణామం రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే వీలుందంటున్నారు.

ఆర్టీసీ సమ్మె రానున్న రోజుల్లో మరింత తీవ్ర రూపం దాలిస్తే.. అందుకు కేసీఆర్ తీసుకున్ననిర్ణయాలే కీలకం కానున్నాయని చెప్పక తప్పదు. పండుగ వేళ సమ్మె చేసింది కాక.. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన సిబ్బందిని విధుల్లోకి తిరిగి తీసుకునే ప్రసక్తే లేదన్న ఆయన.. ఆర్టీసీలో ఇక మిగిలింది కేవలం 1200 మంది లోపేనని పేర్కొనటం గమనార్హం.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఆయన.. తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్దతిలో తీసుకొని నడపాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ రకాలైన 1.22 కోట్ల వాహనాలు ఉన్నాయని.. అవన్నీ కూడా ప్రజా రవాణాకు ఉపయోగపడేవన్న ఆయన.. కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని ఆదేశించారు. కొత్తగా చేరే సిబ్బంది యూనియన్లలో చేరబోమంటూ ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని చెప్పటం గమనార్హం.

మొత్తం 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలన్న ఆయన.. ఏయే కేటగిరికి చెందిన సిబ్బంది సమ్మెకు పోయారో ఆయా సిబ్బందిని భర్తీ చేయటానికి నియామకాలు జరుపుతామన్నారు. ‘‘సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బంది మీద ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. సోషల్‌ మీడియాలో కూడా వ్యతిరేకత వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో విధులకు హాజరు కాని వారిని తిరిగి విధుల్లోకి తీసుకోం’’ అని తేల్చి చెప్పిన కేసీఆర్.. బ్లాక్ మొయిల్ విధానం.. తలనొప్పి కలిగించే చర్యలు శాశ్వితంగా ఉండకూడదన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ఎంతో మంచిగా చూసుకున్నా సమ్మెకు దిగటం ఏమిటంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి..కేసీఆర్ తీరుపై విపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.