Begin typing your search above and press return to search.

కేసీఆర్.. తన అటెండర్ ఇంటికి వెళ్లాడు

By:  Tupaki Desk   |   26 Dec 2016 8:16 AM GMT
కేసీఆర్.. తన అటెండర్ ఇంటికి వెళ్లాడు
X
కాల్పనిక కథానాయకుడి లక్షణాలు కొన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో కనిపిస్తాయి. ఆయన్ని కలవటం ఎంత కష్టమో.. అంతే ఈజీ కూడా. ఎవరి వరకో ఎందుకు.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు లాంటి నేతకు.. అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు కేసీఆర్ ఎన్నిసార్లు రిజెక్ట్ చేశారో తెలియంది కాదు. తన పార్టీ సీనియర్ నేత కేకే ఇంట జరిగిన వివాహ వేడుకకు వెళ్లిన కేసీఆర్ కు.. వీహెచ్ ఎదురపడి.. ఏం సీఎం సాబ్.. ఎన్నిసార్లు అడిగినా అపాయింట్ మెంట్ ఇవ్వవే? అంటూ సూటిగా అడిగేయటం.. ఆ వెంటనే స్పందించిన కేసీఆర్.. బండెక్కు.. ఇంటికి పోదామని తీసుకెళ్లి.. నలభై నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన వీహెచ్ అప్పటివరకూ తెలంగాణ సీఎం మీద ఉన్న నారాజ్ మొత్తం పోయిన చందంగా మాట్లాడటం చూస్తే.. కేసీఆర్ లో తెలీని మేజిక్ ఉందన్న విషయాన్ని ఒప్పుకోక తప్పదు.

విపక్ష నేతలు తనను కలిసేందుకు ప్రయత్నించినా.. తన దగ్గరకు రానివ్వని కేసీఆర్.. రతన్ టాటా లాంటి వ్యక్తి హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి వస్తే.. తాను ఆ కార్యక్రమానికి అటెండ్ కావాల్సి ఉన్నా.. పెద్దగా పట్టించుకోని తత్త్వం కేసీఆర్ ది. అలాంటి వ్యక్తి.. తన దగ్గర అటెండర్ గా పని చేసే ఓ చిరుద్యోగి ఇంటికి వెళ్లే అవకాశం ఉందా? అంటే లేదనే మాటనే చెబుతారు ఆయన గురించి పూర్తిగా తెలియని వారు.

కానీ.. ఆయనలోని అన్ని కోణాల్ని చూసినోళ్లు మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అవుతారు. నిజమే.. తన దగ్గరి అటెండర్ గా పని చేసే ఎల్లయ్య ఇంట జరిగిన పెళ్లికి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి తన విలక్షణతను మరోసారి ప్రదర్శించారు. పెద్ద పెద్ద మొనగాళ్లు అన్నోళ్లకు తన దర్శనభాగ్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడని ఆయన.. తన దగ్గర పని చేసే ఒక సాదాసీదా వ్యక్తి ఇంట పెళ్లికి వెళ్లటమే కాదు.. అక్కడ కాసేపు ఉండి రావటం చూస్తే.. ఇలాంటివి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతున్నయని చెప్పాలి. ఈ ప్రోగ్రాంకు హాజరయ్యేందుకు బేగంపేట నుంచి నాచారం వరకూ వెళ్లి వచ్చిన ఆయన.. తన విలక్షణతను ప్రదర్శించి పలువురిని ఆశ్చర్యచకితుల్ని చేశారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/