Begin typing your search above and press return to search.

జగన్ కేసీయార్ విశాఖ భేటీ మీద ఉత్కంఠ

By:  Tupaki Desk   |   25 Jan 2023 8:00 AM GMT
జగన్ కేసీయార్ విశాఖ భేటీ మీద ఉత్కంఠ
X
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీయార్, జగన్ విశాఖ వేదికగా కలుస్తారా. ఏకాంత చర్చలు ఉంటాయా. చాలా కాలం తరువాత ఇద్దరు నేతలూ సాగర తీరం సాక్షిగా కలిసి ఏమి మాట్లాడుకుంటారు. ఇవన్నీ ప్రశ్నలే. జవాబులు మాత్రం దొరకవు. ఎందుకంటే ప్రచారంలో ఉన్న దాని ప్రకారం చూస్తే ఇద్దరు సీఎంలు విశాఖకు తప్పనిసరిగా వస్తున్నారు. అలా రావాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఒకే రోజున వస్తారా అన్న దాని మీద స్పష్టత అయితే లేదు.

విశాఖలోని శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు ఈ నెల 27 నుంచి 31 వరకూ అయిదు రోజుల పాటు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ముఖ్య అథిధులుగా ఇద్దరు ముఖ్యమంత్రులూ కేసీయార్, జగన్ ఉన్నారు. ఏపీ సీఎం జగన్ అయితే ఈ నెల 28న పీఠంలో జరిగే రాజశ్యామల యాగంలో పాలుపంచుకుంటారని అనధికార వార్తల బట్టి తెలుస్తోంది. కేసీయార్ సైతం వచ్చి రాజ శ్యామల మాత అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు అని అంటున్నారు.

అయితే ఇద్దరూ ఒకే తేదీన వస్తారా లేక వేరు వేరుగా హాజరవుతారా అన్న దాని మీద అయితే ఈ రోజుకీ స్పష్టత లేదు అంటున్నారు. ఇక కేసీయార్ విషయం చూస్తే జగన్ ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రుడు అని అంటారు. జగన్ మౌనంగా ఉన్నా కేసీయార్ తోనే అని చెబుతారు. ఇప్పటిదాకా ఎవరి రాష్ట్రాలలో వారు రాజకీయం చేసుకుంటూ వచ్చారు. అయితే బీయారెస్ పెట్టిన కేసీయార్ ఏపీలో కాలూనుతున్నారు.

ఆయన ఏపీలో రాజకీయం చేయడం అంటే అది జగన్ కి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అంటే విపక్షాల ఓట్లు చీల్చాలని చూస్తే మాత్రం ప్లస్ అవుతుంది అని అంటున్నారు. ఏపీలో కేసీయార్ గట్టిగానే బీయారెస్ ని బరిలో నిలబెడతారు అని అంటున్నారు. బీయారెస్ పేరిట దేశంతా తిరుగుతున్న కేసీయార్ తనకు మంచి మిత్రుడిగా ఉన్న సాటి తెలుగు సీఎం జగన్ని మాత్రం కలవలేదు. అయితే విశాఖ వేదికగా జగన్ తో కేసీయార్ భేటీ అవుతారా అన్నదే ఇపుడు ప్రచారంలో ఉన్న మాట.

ఇక ఈ ఇద్దరు మిత్రుల మధ్య చాలా కాలంగా భేటీలు అయితే లేవు ఇద్దరు రాజకీయ దారులూ వేరుగా ఉంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ మీద తొడకొడుతూ కేసీయార్ బీయారెస్ ని స్టార్ట్ చేస్తే జగన్ బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. బహుశా ఈ విభేదాలు ఇద్దరినీ కలవనీయడంలేదు అని అంటున్నారు. ఇక రాష్ట్ర ప్రయోజనాల విషయం తీసుకున్న కేసీయార్ క్రిష్ణా జలాల వివాదం ఇద్దరి మధ్య ఎడం పెంచింది. అలాగే పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ ని రాయలసీమకు జీవాధారంగా జగన్ చూస్తూంటే దానికి కేసీయార్ అడ్డుపుల్ల వేశారు.

దాంతో ఇద్దరు మధ్య మాటా మంతీ లేకుండా పోయింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే బీయారెస్ మీటింగ్స్ కి అందరి సీఎంలను పిలుస్తున్న కేసీయార్ జగన్ వైపు కన్నెత్తి చూడడంలేదు. అయితే ఇద్దరికీ వారధిగా శారదాపీఠం స్వామీజీ ఉన్నారు. ఇద్దరు సీఎంలు స్వామీజీకి సన్నిహితులే. పైగా ఇద్దరు మధ్య పెద్దగా విభేదాలు లేవు అని అంటున్న వారూ ఉన్నారు. దాంతో విశాఖకు స్వామీజీ పిలుపు మీద వస్తున్న ఇద్దరూ కలుసుకుంటారా అన్న చర్చ అయితే ఉంది.

ఇద్దరూ కలుసుకోవాలనుకుంటే ఈ నెల 28న జగన్ వస్తున్న టైం లోనే కేసీయార్ కూడా రావాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా అయితే మాత్రం కేసీయార్ వేరే తేదీలలో పీథానికి వస్తారని అంటున్నారు. మరి కేసీయార్ జగన్ ల మధ్య దోబూచులాడుతున్న స్నేహం రాజకీయ బంధాల గురించి జరుగుతున్న ప్రచారంలో పస ఎంత ఉంది అన్నది పీఠం సాక్షిగా తేటతెల్లమవుతుంది అని అంటున్నారు. మొత్తానికి ఇపుడు అందరి ఫోకస్ శారదాపీఠం మీదనే ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.