Begin typing your search above and press return to search.

చంద్రుళ్లు ఆయన్ని ఏమడిగారు?

By:  Tupaki Desk   |   7 April 2016 4:31 AM GMT
చంద్రుళ్లు ఆయన్ని ఏమడిగారు?
X
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సెంటిమెంట్ మాటలు ఏ రేంజ్ లో ఉంటాయన్న విషయాన్ని కేంద్రానికి చెందిన ఒక సీనియర్ అధికారికి స్వయంగా అనుభవంలోకి వచ్చింది. ఇద్దరు చంద్రుళ్ల సెంటిమెంట్ ఓ రేంజ్ లో ఉండటమే కాదు.. వాటిని బదులివ్వటంలో ఉన్న ఇబ్బందుల్ని ఆయన గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ కొటారి బుధవారం హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. నిధులు.. నీళ్లు.. నియామకాల నినాదంతోనే తెలంగాణ ఉద్యమం వచ్చిందని.. తమ ఉద్యోగాలు తమకే దక్కాలని తెలంగాణ ప్రజలుకోరుకుంటున్నట్లు చెప్పిన కేసీఆర్.. ఉద్యోగుల విభజనలో జరుగుతున్న జాప్యంతో పాలనపై విపరీతమైన ప్రభావం పడుతుందని చెప్పుకొచ్చారు.

ఉద్యోగుల విభజన అవసరమని.. వెంటనే పూర్తి చేయాలని కోరారు. అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి పడుతున్నంత ఆందోళన ఉద్యోగుల విభజనవిషయం లేదన్న మాట సంజయ్ మాటల్లో వినిపించటం గమనార్హం. ఉద్యోగుల విభజన ప్రక్రియ 84 శాతం పూర్తి అయ్యిందని.. ఆగస్టు నాటికి వందశాతం పూర్తి అవుతుందని చెప్పారు. తెలంగాణకు 30 శాతం మంది ఐఏఎస్.. ఐపీఎస్ అధికారుల్ని అదనంగా కేటాయించిన విషయాన్ని కేసీఆర్ కు గుర్తు చేయటం గమనార్హం. తెలంగాణ ముఖ్యమంత్రి తన వాదనకు సెంటిమెంట్ ను జోడిస్తే.. తాను మాత్రం తక్కువ తినలేదన్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన వాదనను వినిపించారు.

కేంద్రం నుంచి హైదరాబాద్ కు వచ్చిన సంజయ్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. విభజన కారణంగా ఏపీకి అన్యాయం జరిగిందని.. సమ న్యాయం లేని విభజన కారణంగా ఏపీ ప్రజల్లో కసి.. ఆగ్రహం వచ్చాయని.. ఈ కారణంతోనే నాటి అధికార కాంగ్రెస్ భారీ మూల్యాన్ని చెల్లించిందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనా అడిగితేనే చేద్దామన్న వైఖరి మంచిది కాదని.. దక్షిణాది రాష్ట్రాలకు వస్తున్న ఆదాయానికి సమానంగా ఏపీకి సాయం చేయాలని.. ఆ విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లాలన్న మాటను చెప్పుకొచ్చారు.కేంద్రంలో మిత్రపక్షంగా వ్యవహరిస్తూ.. అడిగినంతనే మోడీ అపాయింట్ మెంట్ ను పొందే అవకాశం ఉందని చెప్పే చంద్రబాబు.. ఇలాంటి విషయాల్ని ప్రధానితో నేరుగా చర్చించకుండా.. ఒక ఐఏఎస్ అధికారితో మాట్లాడటం చూస్తుంటే.. చంద్రబాబును మోడీ పక్కకు పెట్టినట్లుగా సందేహం కలగక మానదు.