Begin typing your search above and press return to search.

అరే.. కేసీఆర్ మాటల్నే బాబు వల్లె వేశారే

By:  Tupaki Desk   |   7 Aug 2016 5:23 AM GMT
అరే.. కేసీఆర్ మాటల్నే బాబు వల్లె వేశారే
X
పేరులోనే కాదు ఆలోచనల్లో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఒకేలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ అంశాల మీద ఇద్దరి ఆలోచనలు.. విజన్ ఒకేలా ఉంటుంది. కాకుంటే.. ఒకేలాంటి ఆలోచనల్ని ఇద్దరు చంద్రుళ్లు తమకు తగ్గట్లుగా మార్చుకుంటారని చెప్పాలి. ఇద్దరి మాటలు.. పని తీరులో ఉన్న వ్యత్యాసంతో చంద్రుళ్ల ఇద్దరిలో ఉన్న సారూప్యతలు పెద్దగా ఫోకస్ కావు. కానీ.. నిశితంగా పరిశీలిస్తే.. చంద్రబాబులోని ‘మంచి’ని కేసీఆర్ తీసేసుకోవటం.. ప్రజల్ని ప్రభావితం చేసే కేసీఆర్ ‘మాటల్ని’ చంద్రబాబు తనకు తగ్గట్లుగా మార్చుకోవటం తరచూ కనిపిస్తూ ఉంటుంది.

తాజాగా ఇద్దరు చంద్రుళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొక్కల పెంపకంపై పెద్ద ఎత్తున ప్రచారం చేయటమేకాదు.. భారీగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మొక్కలు నాటే విషయంలో చంద్రబాబుతో పోలిస్తే.. కేసీఆర్ ఫాస్ట్ గా ఉన్నారని చెప్పాలి.మొక్కల పెంపకంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు సీరియస్ గా తీసుకోవాలని.. వారెంత సీరియస్ గా తీసుకుంటారో అంత లాభం కలుగుతుందన్న విషయాన్ని ఆ మధ్యన వెల్లడించటం తెలిసిందే. అంతేకాదు.. మొక్కలు నాటే కార్యక్రమాన్నిపట్టించుకోని నేతలకు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే విషయం కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొనటం తెలిసిందే.

కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటల్ని రెండువారాల్లోనే చంద్రబాబుకాపీ కొట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. తాజాగా అనంతపురం జిల్లాలో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మొక్కలు నాటని నేతలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయేలా చేస్తానని చంద్రబాబుచెప్పటం గమనార్హం. అంతేకాదు.. ఉద్యోగులు మొక్కలు పెంచకపోతే ఇంక్రిమెంట్లు నిలిపేస్తామని చెప్పిన ఆయన.. మొక్కలు పెంచే విద్యార్థులకు అదనపు మార్కులు ఇవ్వనున్నట్లు ప్రకటించటం గమనార్హం. మొక్కలకు.. నేతలకు ఇచ్చే టికెట్లకు లంకె పెట్టిన కేసీఆర్.. బాటలో చంద్రబాబు నడవటమే కాదు.. ఆయన మాటల్నే బాబు పలకటం చూస్తే.. ఇద్దరూ ఒకరి ఆలోచనల్ని మరొకరు ఎంతలా స్ఫూర్తి పొందుతారో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.