Begin typing your search above and press return to search.

రోహిత్ ఉదంతంపై చంద్రుళ్ళు నోరు విప్పలేదే

By:  Tupaki Desk   |   21 Jan 2016 4:39 AM GMT
రోహిత్ ఉదంతంపై చంద్రుళ్ళు నోరు విప్పలేదే
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో అటు రాష్ట్ర నేతలు మొదలుకొని.. జాతీయ నేతల వరకూ అందరూ స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలుకొని.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరితో పాటు పలువురు జాతీయ స్థాయి నేతలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి.. రోహిత్ తరఫున నిరసన చేస్తున్న విద్యార్థుల్ని పరామర్శిస్తున్నారు. వారు చేస్తున్న ఆందోళనకు తమ వంతు సాయంగా మద్దతు ప్రకటిస్తున్నారు.

తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వస్తున్న పరిస్థితి. ఇంతలా ఇంతమంది నేతలు వస్తుంటే.. ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటివరకూ స్పందించింది లేదు. వారు ఎవరూ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థుల్ని పరామర్శించింది లేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు.. టీఆర్ఎస్ కు చెందిన నేతలు కొందరు ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. అంతేతప్ప రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెద్దగా స్పందించింది లేదు.

ఏదైనా విషయం జరిగిన వెంటనే దూసుకెళ్లినట్లుగా వ్యవహరించే ఇద్దరు చంద్రుళ్లు తాజా ఉదంతంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లోనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై మాట్లాడింది లేదు. సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లింది లేదు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలోనే ఉన్నారు. తాజాగా ఆయన దావోస్ లో జరుగుతున్న ఆర్థిక సదస్సుకు వెళ్లిన నేపథ్యంలో చంద్రబాబు వెళ్లకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఈ విషయం మీద బాబు రియాక్ట్ అయ్యింది కూడా తక్కువే.

మరోవైపు.. ఈ అంశంపై ఎక్కడో ఉండే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రియాక్ట్ కావటమే కాదు.. ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీకి వస్తున్నారు. ఇలా ఎక్కడెక్కడి నేతలు సెంట్రల్ యూనివర్సిటీకి వస్తున్నా.. ఇద్దరు చంద్రుళ్లు మాత్రం ఈ అంశంపై ఆచితూచి రియాక్ట్ కావటం గమనార్హం.