Begin typing your search above and press return to search.

ఒకరు కాదు.. ఇద్దరు చంద్రుళ్లు డుమ్మా

By:  Tupaki Desk   |   10 July 2015 4:53 PM GMT
ఒకరు కాదు.. ఇద్దరు చంద్రుళ్లు డుమ్మా
X
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు విందు ఏర్పాటు చేస్తే.. ప్రముఖులు కచ్చితంగా వెళతారు. ఇక.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌ అయిన నరసింహన్‌ లాంటి వ్యక్తి విందు ఏర్పాటు చేస్తే.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాకుండా ఉంటారా.? అని ప్రశ్నిస్తారు. అయితే.. ఆసక్తికరంగా ఇద్దరు ముఖ్యమంత్రులు తాజాగా గవర్నర్‌ ఇచ్చే ఇఫ్తార్‌ విందునకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు.

విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో.. ఇరువురు సీఎంలు ఒకచోట కలవటం ద్వారా.. రెండు రాష్ట్రాల మధ్యనున్న పలు వివాదాలు తగ్గే సూచన ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే.. ఇద్దరు అధినేతల మధ్యనున్న విభేదాల కారణంగా వారిద్దరూ కలిసేందుకు పెద్ద సుముఖత వ్యక్తం కాలేదు. ఈ మధ్యన వర్షాకాలం విడిది కోసం రాష్ట్రపతి ప్రణబ్‌ హాజరుకావటం.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులలో ఇరువురు ముఖ్యమంత్రుల్లో ఎవరో ఒకరు డుమ్మా కొట్టటం తెలిసిందే.

తాజాగా గవర్నర్‌ ఇఫ్తార్‌ విందు ఇస్తున్నారు. దీనికి ఇరువురు ముఖ్యమంత్రుల్ని గవర్నర్‌ ఆహ్వానించారు. తాజాగా జపాన్‌ పర్యటన ముగించుకొని వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి శుక్రవారం ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అవుతూ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఆయన మీటింగ్స్‌ శుక్రవారం సాయంత్రం వరకూ సాగటంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యే పరిస్థితి కనిపించటం లేదు.

తాజాగా ఆయన గవర్నర్‌కు తన గైర్హాజరీకి సంబంధించిన సమాచారాన్ని పంపించారు. వాస్తవానికి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య విభేదాలు తారా స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇరువురు ఒకరిని ఒకరు ఎదురు పడటానికి ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తాజా ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు ఎదురు పడతారని భావించారు. కానీ.. ఢిల్లీ పర్యటనలో ఉన్న బాబు కుదరదని చెబితే.. హరితహారం.. కాస్తంత అనారోగ్యం కారణంగా తాను హాజరు కావటం లేదని కేసీఆర్‌ సైతం డుమ్మా కొట్టినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఇద్దరు చంద్రుళ్లు గైర్హాజరు కావటం కాస్తంత ఆశ్చర్యకర పరిణామమే మరి.