Begin typing your search above and press return to search.

కేసీఆర్ దెబ్బ‌కు ముగ్గురే మిగిలారు

By:  Tupaki Desk   |   16 Jun 2016 11:13 AM GMT
కేసీఆర్ దెబ్బ‌కు ముగ్గురే మిగిలారు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాల్లో ప్ర‌తిప‌క్షాలు విల‌విల్లాడుతున్నాయ‌నేందుకు ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితే నిద‌ర్శ‌నం. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు శ్రీ‌కారం చుట్టిన కేసీఆర్ ఈ క్ర‌మంలో ద‌ఫాద‌ఫాలుగా దాన్ని కొనసాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌ లో తెలంగాణ‌లో ఆయా పార్టీల‌ ఎంపీల‌ను కారెక్కించ‌డం ద్వారా కేసీఆర్ నూత‌న రికార్డు సృష్టించారు. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ మిన‌హా మూడు పార్టీలు మాత్ర‌మే ప్రాతినిద్యం వ‌హించేలా అదికూడా ఒక్కో ఎంపీ మాత్ర‌మే ఉండేలా చ‌క్రం తిప్పారు.

తెలంగాణకున్న మొత్తం 17 ఎంపీ సీట్లలో 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్ 11 సీట్లు గెలిచింది. అనంతరం ఖమ్మం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి - మల్కాజ్ గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి కూడా టీఆర్ ఎస్ లో చేరారు. తాజాగా న‌ల్ల‌గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి సైతం కారెక్కేశారు. మొత్తంగా టీఆర్ ఎస్ 14 సీట్లతో మరింత బలం పెంచుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి మిగతా మూడు సీట్లలో పార్టీకొక్కరు చొప్పున ముగ్గురు లోక్ సభ స‌భ్యులే ఉన్నారు. కాంగ్రెస్ త‌ర‌ఫున నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా గెలిచిన‌ నంది ఎల్లయ్య - బీజేపీకి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ - మజ్లిస్ త‌ర‌ఫున‌ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మొత్తంగా రెండు సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఒక్క స్థానానికి - ఒక్కోసీటు గెలిచిన టీడీపీ - వైసీపీ పార్ల‌మెంటు స‌భ్యులే లేకుండా చేయ‌డంలో కేసీఆర్ చాణ‌క్యం ఫ‌లించింద‌ని అంటున్నారు. ఎమ్మెల్యేల విష‌యంలో వేసిన ఎత్తుగ‌డ‌ల‌కే ప్ర‌తిప‌క్షాలు క‌కావిక‌లం అయితే ఇపుడ‌ది ఎంపీల వ‌ర‌కు కూడా చేరింద‌ని చ‌ర్చించుకుంటున్నారు.