Begin typing your search above and press return to search.

జానారెడ్డికి కేసీయార్ మద్దతా ?

By:  Tupaki Desk   |   21 Jan 2021 8:30 AM GMT
జానారెడ్డికి కేసీయార్ మద్దతా ?
X
విచిత్రంగా ఉన్నా అధికార టీఆర్ఎస్ లో జరుగుతున్న చర్చిదే. రేపు నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ సినియర్ నేత కుందూరు జానారెడ్డి గెలుపుకు టీఆర్ఎస్ చీఫ్ కేసీయార్ అన్నీ విధాలుగా సహాయసహకారాలు అందించబోతున్నట్లు టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ లో కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి ఈ చర్చ రెండుపార్టీల్లోని ఉన్నతస్ధాయి నేతల మధ్య మాత్రమే నలుగుతోంది. కేసీయార్ వైఖరికి ప్రధాన కారణం ఏమిటంటే బీజేపీని దెబ్బకొట్టడమే.

కేసీయార్ చేసిన తప్పుల వల్లే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. తెలంగాణాలో తనకు ప్రత్యర్ధులే ఉండకూడదన్న కేసీయార్ ఆలోచన ఇపుడు ఆయనకే బూమరాంగ్ అవుతోంది. మొదటగా టీడీపీని భూస్ధాపితం చేసేశారు. అంతటితో ఆగకుండా తర్వాత కాంగ్రెస్ ను చీలికలు పీలికలు చేసేశారు. రెండు ప్రధాన పార్టీల నేతల్లో ఎక్కువమంది టీఆర్ఎస్ లో చేరిపోయారు. టీడీపీకన్నా కాంగ్రెస్ కాస్త నయమే అయినా ఆ పార్టీలోని నేతల్లో కూడా ఎక్కువమంది కేసీయార్ మద్దతుదారులుగానే మిగిలిపోయారు.

కాబట్టి తనకిక ఎదురేలేదని కేసీయార్ అనుకున్నారు. అప్పటికి బీజేపీ బలం గురించి అనుకునే వాళ్ళే లేరు కాబట్టి కేసీయార్ కూడా పట్టించుకోలేదు. అయితే కేసీయార్ ఒకటనుకుంటే జనాలు మరొకటనుకున్నారు. ప్రధానపార్టీలను నేలమట్టం చేశానని కేసీయార్ అనుకుంటే జనాలే బీజేపీకి ఓట్లేసి బలమైన ప్రతిపక్షంగా తయారుచేశారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా నాలుగు లోక్ సభ సీట్లలో బీజేపీని జనాలు గెలిపించటమే ఇందుకు నిదర్శనం. ఇక అప్పటి నుండి కేసీయార్ ను బీజేపీ వరుసగా తగులుకుంటునే ఉంది. కేసీయార్ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో బీజేపీ మంటలు మండిస్తోంది.

మొన్నటి దుబ్బాక అసెంబ్లీలో గెలవటం, గ్రేటర్ ఎన్నికలో నాలుగు డివిజన్ల నుండి 46 డివిజన్లకు పెరగిందంటే అదంతా కేసీయార్ స్వయంకృతమనే చెప్పాలి. టీడీపీని దెబ్బకొట్టిన కేసీయార్ అంతటితో ఊరుకునుంటే సరిపోయేది. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ బలంగా ఉండుంటే బీజేపీకి ఎదిగే అవకాశం ఉండేదికాదు. కేసీయార్ వ్యూహం వికటించటంతో ఇపుడు లేనిబూతాన్ని తనంతట తానుగా సృష్టించుకున్నట్లయ్యింది. ఈ పరిస్ధితుల్లో నాగార్జునసాగర్ ఉపఎన్నికలో గెలుపు తమదే అని బీజేపీ నేతలు తొడకొడుతున్న కారణంగా కేసీయార్ లో టెన్షన్ పెరిగిపోతోంది.

కాంగ్రెస్ ను దెబ్బకొట్టినట్లు బీజేపీని కొట్టడం కేసీయార్ చేతిలో లేదు. అందువల్ల కమలంపార్టీ గ్రాఫ్ పెరిగిపోతున్నా ఏమీ చేయలేని పరిస్ధితిలో పడిపోయారు. ఇపుడు నాగార్జునసాగర్ లో గనుక బీజేపీ గెలిస్తే కేసీయార్ పనిగోవిందా అంటున్నారు జనం. అందుకనే ముందుజాగ్రత్తగా కాంగ్రెస్ గెలుపుకు సహకరించాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమో కాదో గాని.. సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా జానారెడ్డి గెలవటం మాత్రం కేసీయార్ కు చారిత్రాత్మక అవసరం.

ఇందులో భాగంగానే జానారెడ్డిని టీఆర్ఎస్ నేతలే గెలిపించేట్లున్నారు. కేసీయార్ వ్యూహం వరకు బాగానే ఉంది కానీ జనాలు ఏమనుకుంటున్నారన్నది చాలా ముఖ్యం. జనాలు ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ అవసరం లేదనుకుంటే అప్పుడు బీజేపీనే గెలుస్తుంది. మరి జనాలు ఏమనుకుంటున్నారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుందో.