Begin typing your search above and press return to search.

ఈడీ సమన్లపై కవిత షాకింగ్‌ రియాక్షన్‌.. సంచలన ప్రెస్‌ మీట్‌!

By:  Tupaki Desk   |   9 March 2023 2:59 PM GMT
ఈడీ సమన్లపై కవిత షాకింగ్‌ రియాక్షన్‌.. సంచలన ప్రెస్‌ మీట్‌!
X
ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎనఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 9న విచారణకు రావాలని నోటీసులు జారీ చేయగా కవిత తాను మార్చి 15 తర్వాత విచారణకు వస్తానని ఈడీకి మొదట లేఖ రాశారు. అయితే ఈడీ కవిత లేఖపై స్పందించకపోవడంతో మార్చి 11న విచారణకు వస్తానని మరో లేఖ రాశారు. దీనికి కూడా ఈడీ స్పందించలేదు.

మరోవైపు కవిత మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరుతూ ఒక రోజు ఢిల్లీలో నిరసన దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో మార్చి 9న కవిత ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈడీ నోటీసులపై కవిత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రిజర్వేషన్‌ పై ఆందోళనకు పిలుపు ఇస్తే ఈడీ తనకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు. మార్చి 9న విచారణకు రావాలని ఈడీ నోటీసు ఇచ్చిందని అయితే తాను 11న విచారణకు వస్తానని ఈడీకి సమాచారం ఇచ్చానని వెల్లడించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎందుకు విచారించరని కవిత ఈడీని ప్రశ్నించారు. మోదీకి భయపడనని, విచారణను ఎదుర్కొంటానని తెలిపారు. ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ నేతలను వేధించడం కేంద్ర దర్యాప్తు సంస్థలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని, అది సాధ్యం కాకపోవడంతో తనను టార్గెట్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలను రాజకీయంగా తిప్పికొడతామని కవిత ధీమా వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణం దర్యాప్తుపై అంత తొందర ఎందుకని కవిత ప్రశ్నించడం గమనార్హం. మహిళలను ఇంటిలో విచారించాలని, కావాలంటే నిందితులను ఇంటికి తీసుకురావాలని ఈడీని కోరానని కవిత తెలిపారు. రెండు రోజుల సమయమైనా తనకు ఇవ్వరా అని ప్రశ్నించారు.

దర్యాప్తు సంస్థలు మహిళలను విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు. దర్యాప్తు సంస్థలు మహిళ ఇంటికొచ్చి విచారించాలన్నది చట్టం చెబుతోందని కవిత గుర్తు చేశారు. కానీ ఈడీ తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదన్నారు. అధికారంలో లేని రాష్ట్రాల్లో మోడీ కంటే ముందు ఈడీ వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని.. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

మోడీ వైఫల్యాలను కప్పిపుచ్చడానికే ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారని కవిత మండిపడ్డారు. మోడీ వన్‌ నేషన్, వన్‌ ఫ్రెండ్‌ అనే కొత్త స్కీమ్‌ తెచ్చారని ఎద్దేవా చేశారు. మోడీ బయటే కాదు, పార్లమెంట్‌లోనూ అబద్ధాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. మార్చి 10 ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ దీక్షలో 5 వందల మంది పాల్గొంటారని తెలిపారు. 27 ఏళ్లుగా మహిళా బిల్లు కోసం చర్చ జరుగుతోందని గుర్తు చేశారు. రాజ్యసభలో మహిళా బిల్లు తెచ్చిన సోనియాకు సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. అధికారంలోకి వస్తే మహిళా బిల్లు తెస్తామని 2014, 2018లో మోడీ మాటిచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత దాన్ని కోల్డ్‌ స్టోరేజీలో పడేశారని విమర్శించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.