Begin typing your search above and press return to search.

కవిత ఆహ్వానం పంపారు.. కాంగ్రెస్ కడిగేయాలి కదా?

By:  Tupaki Desk   |   10 March 2023 4:00 PM GMT
కవిత ఆహ్వానం పంపారు.. కాంగ్రెస్ కడిగేయాలి కదా?
X
మిగిలిన రంగాల్ని కాసేపు పక్కన పెడదాం. రాజకీయాల్లో మాత్రం దయాదాక్షిణ్యాలకు అస్సలు తావు ఉండదు. రాజకీయాల్లో పైకి రావాలంటే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవటం.. ప్రత్యర్థుల్ని కోలుకోని రీతిలో దెబ్బ తీయటం లాంటివి సహజంగా జరగాల్సిన చర్యలు. మిగిలిన రాజకీయ పార్టీల సంగతి ఎలా ఉన్నా.. జాతీయ పార్టీ కాంగ్రెస్ ఈ విషయంలో మాస్టర్ అని చెప్పాలి. మిత్రుల్ని అవసరానికి ఎలా వాడుకోవాలో దానికి తెలిసినంత బాగామరెవరికీ తెలీదు. ఎంతటి మిత్రుడినైనా సరే.. కూరలో ఉప్పులా వాడుకుంటూనే.. అవసరం అయ్యాక కూరలో కరివేపాకులా పక్కకు పడేసే విషయంలో దాని తర్వాతే ఎవరైనా.

అదే సమయంలో.. తమకు థమ్కీ ఇచ్చిన పార్టీల విషయంలో ఆ పార్టీ ఎంత కఠినంగా ఉంటుందో చరిత్రను చూస్తే అర్థమవుతుంది. తాము దెబ్బ తీయొచ్చు కానీ తమను మాత్రం ఎవరూ దెబ్బ తీయకూడదన్నట్లుగా వ్యవహరించే ఆ పార్టీ ఇటీవల కాలంలో తన మూలాల్ని మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. తనను దెబ్బ తీయటమే కాదు.. దారుణంగా ఇబ్బందికి గురి చేసి.. తన ఉనికిని సైతం ప్రశ్నార్థకంగా మార్చిన పార్టీ విషయంలో ఆ పార్టీ తాజాగా వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మద్యం కుంభకోణంలో తీవ్రమైన ఆరోపణల్ని ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ లో నిర్వహించిన దీక్షకు అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించటం తెలిసిందే. అందులో కాంగ్రెస్ కూడా ఉందన్నది మర్చిపోకూడదు. ఈ దీక్ష మొత్తం వ్యూహాత్మకమే అయినప్పటికీ.. మోడీ మీద ఉన్న కోపంతోనో.. మరో కారణంతోనో కవిత పక్షాన నిలిచేందుకు పలు పార్టీలు సిద్ధమవుతున్నాయి. తమను తోక పార్టీగా తేల్చేసి.. కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వటానికి కూడా ససేమిరా అన్నకేసీఆర్ కుమార్తెకు దన్నుగా నిలవటానికి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లాంటి వారు ముందుకు రావటం.. కమ్యునిస్టుల మీద ఉన్న కనీస గౌరవాన్ని తగ్గించేలా చేస్తుందని చెప్పాలి.

కమ్యునిస్టులు అయితే.. ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతూ.. వార్తల్లో తమ గురించి కాస్త వస్తే చాలు.. అదే పది వేలు అన్నట్లుగా భావించటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. కాంగ్రెస్ మాటేమిటి? ఇప్పుడు ఆ పార్టీ తీరు చూస్తే.. పలు ప్రశ్నలు మనసులోకి రావటం ఖాయం. కాంగ్రెస్ కు ఇప్పుడేమైంది? దాని మొదడు మొద్దుబారిందా? దాని కీలక వ్యూహకర్తలు తమ చరిత్రను మర్చిపోయారా? తమను దారుణంగా దెబ్బ తీసిన వారి అవసరాలకు ముడి సరకులా మారాల్సిన అవసరం ఉందా? లాంటి సందేహాలు రావటం ఖాయం.

ఈ రోజున ఢిల్లీలో జరిగే కవిత దీక్షకు కాంగ్రెస్ అండగా నిలిస్తే.. రేపొద్దున తెలంగాణలో కాంగ్రెస్- కేసీఆర్ కలిసి పోయారన్న మాటతో నష్టం కలిగేది గులాబీ బాస్ కు కాదు.. కాంగ్రెస్ పార్టీకి అన్న విషయాన్ని మర్చిపోయారా? అసలు.. ఇప్పుడు ఇంత హటాత్తుగా మహిళా రిజర్వేషన్ల అంశం ఎందుకు గుర్తుకు వచ్చింది? అన్న ప్రశ్న వేసుకుంటే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. అలాంటప్పుడు.. దీక్షకు సంబంధించిన అంశంపై బీఆర్ఎస్ కు ఉన్న కమిట్ మెంట్ ఏమిటి? అన్న ప్రశ్నతో పాటు.. అంత కమిట్ మెంట్ ఉంటే.. తెలంగాణ మంత్రిమండలిలో మహిళల స్థానం ఏమిటి? తాజాగా ఎంపిక చేసిన ఎమ్మెల్సీల్లో మహిళలు ఎంతమంది ఉన్నారు? లాంటి ప్రశ్నలు వేసి.. ఇలా అర్థం లేని దీక్షల్లో తాము పాలు పంచుకోమని తేల్చి పారేయటం ద్వారా.. బీఆర్ఎస్ కు సరైన పాఠం నేర్పే వీలు ఉంటుంది కదా? అన్న మాట వినిపిస్తోంది.

దీనికి కౌంటర్ గా కొందరు.. ఇప్పుడు అలా చేస్తే.. వచ్చే ఎన్నికల్లో అటు ఇటు కానీమెజార్టీ పార్టీలకు వస్తే.. కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువు తీరటానికి కేసీఆర్ అండగా నిలిచే అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఈ వాదనలో పస లేదని.. అప్పట్లో తెలంగాణ ఇచ్చే సమయంలోనూ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పి.. ఎంతలా థమ్కీ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయి.. ఇలాంటి వాదనలు వినిపించటంలో అర్థం లేదంటున్నారు. కవిత దీక్ష వేళ.. కాంగ్రెస్ రియాక్టు కావాల్సిన తీరు ఇదే మాత్రం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.