చెల్లెమ్మ గైర్ హాజరు...అన్నయ్య ఏం చెప్పారంటే...?

Fri Oct 07 2022 19:04:16 GMT+0530 (India Standard Time)

kavitha BRS national party

సాధారణంగా కుటుంబాలలోనే గొడవలు వస్తూంటాయి. ఇది సహజం. మరి రాజకీయ పార్టీలు పెట్టాక అందులోనూ ఎన్నో వివాదాలు వస్తాయి. రాజకీయ పార్టీలు కూడా కుటుంబాల లాంటివే. అయితే అవి పెద్ద స్థాయిలో ఉంటాయి. అక్కడ చాలా మంది చాలా రకాల భావజాలంతో ఉంటారు. టీయారెస్ ఈ రోజు బీయారెస్ అయినా అది ఫక్తు కుటుంబ పార్టీ అంటే కేసీయార్ ఒప్పరేమో కానీ బీజేపీ సహా విపక్షాలు అదే అంటాయి. దానికి ఉదాహరణగా కేటీయార్ ని తెచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు. అలాగే ఆయన్ని క్యాబినేట్ మంత్రిగా చేశారు. మేనల్లుడు హరీష్ రావుకు మంత్రి పదవి ఇస్తే మరో మేనల్లుడు జె సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అలాగే పార్టీలో కీలకంగా ఉన్నారు.ఇక కుమార్తె కవిత గురించి చెప్పాలీ అంటే 2014లో ఆమె నిజామాబాద్ నుంచి ఎంపీ అయ్యారు. 2019లో ఓడారు కానీ ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇలా తన కుటుంబ సభ్యులందరితోనూ కలుపుకుని కేసీయార్ టీయారెస్ బండిని ముందుకు తీసుకెళ్టున్నారు. ఆ టీయారెస్ బీయారెస్ అయ్యే కీలక సందర్భంలో  కవిత గైర్ హాజరు అయ్యారు. నిజంగా చూస్తే ఇది చాలా కీలకమైన విషయమే. తండ్రి అధినేత కేసీయార్ మరో అడుగు ముందుకేసి జాతీయ పార్టీని పెడుతూంటే ఇంట్లోనే ఉన్న కుమార్తె అది కూడా ఎమ్మెల్సీ అయిన కవిత డుమ్మా కొట్టడం అంటే ఎవరికి తోచినట్లుగా మీడియా కధనాలు వండి వార్చేసింది.

అయితే దీని మీద తాపీగా కేటీయార్ మీడియా ముందుకు వచ్చి అనఫిషియల్ చిట్ చాట్ లో కొన్ని కామెంట్స్ చేశారు అని అంటున్నారు. అదేమంత పెద్ద విషయం కాదని ఆయన అన్నట్లుగా తెలుస్తోంది. ఆ మాటకు వస్తే మరో చేవెళ్ళ  ఎంపీ రంజిత్ కూడా గైర్ హాజరు అయ్యారు కదా అని కేటీయార్ కొత్త పాయింట్ తీశారు. ఇక సర్వ సభ్య సమావేశానికి  283 మంది బలం ఉంటే చాలని కానీ ఆ  సమావేశానికి 279 మంది హాజరయ్యారని ఇది 99 శాతం కంటే ఎక్కువ అని కేటీయార్ పేర్కొన్నారుట.

ఇక టీయారెస్ అయినా బీయారెస్ అయినా తామంతా ఒక కుటుంబం అని తమ మధ్య ఎలాంటి విభేదాలు ఉండవని అసలు విషయాన్ని పక్క తోవ పట్టించేందుకే ఇలాంటివి తెర మీదకు తెస్తున్నారు అని కేటీయార్ ఫైర్ అయినట్లుగా చెబుతున్నారు. ఇక ఆయన ఒక లాజిక్ ప్రశ్న వేశారు. కేసీయార్ మా అధినాయకుడు. ఆయన్ని కాదని పార్టీలో ఎవరైనా ఉండగలరా అని. నిజమే ఎవరైనా కేటీయార్ ని ఎదిరిస్తే ఉండలేరు కానీ ఇక్కడ గైర్ హాజరు అయింది ఆయన కుమార్తె. ఆమెను మిగిలిన వారితో పోల్చగలరా. ఆమె మీద అందరి మాదిరిగా యాక్షన్ తీసుకున్నట్లుగా తీసుకోగలరా. ఇది కూడా పాయింటే కదా.

ఇక అన్న వెర్షన్ చూస్తే ఏమీ లేదని అంతా  మీడియా లేక విపక్షాల క్రియేషన్ తప్ప తామంతా ఒక్కటే అని. కానీ రెండవ వెర్షన్ చూస్తే వేరుగా ఉందని అంటున్నారు. జాతీయ పార్టీగా టీయారెస్ ని మారుస్తున్నపుడు కనీసం తన తండ్రి కేసీయార్ తనతో సంప్రదించలేద్దని కేటీయార్ హరీష్ రావు సంతోష్ కుమార్ లతో మాత్రమే సంప్రదింపులు జరిపారని ఆమె ఆగ్రహించారని అంటున్నారు. ఇంతటి కీలకమైన విషయంలో తనను ఎందుకు భాగస్వామిగా తీసుకోలేదు అన్నదే ఆమె బాధ అని అంటున్నారు.

ఇక దీని కంటే ముందు 2018లో కేటీయార్ కి టీయారెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసే సమయంలో కూడా కవితను పట్టించుకోలేదని ఆమెకు ఆ వార్త ముందుగా తెలియలేదని కూడా అంటున్నారు. నిజానికి టీయారెస్ జాతీయ స్థాయిలో ఎదిగితే తాను కూడా అందులో కీలకం కావాలని ఆమె అనుకున్నారని అంటున్నారు. కేసీయార్ తో పలు మార్లు ఆమె ఢిల్లీ వెళ్లారు కూడా.

అయితే సరిగ్గా పార్టీ జాతీయ స్థాయిలోకి తీసుకువచ్చే వేళ మాత్రం ఆమె కనిపించకపోవడం అంటే ఫ్యామిలీ లో విభేధాలు ఉన్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది. కేటీయార్ అయిఏ ఏమీ లేదు అని చెబుతున్నారు కానీ ఈ మాట కవిత నోటి వెంట వస్తే కానీ ఈ రకమైన ప్రచారానికి ఫుల్ స్టాప్ పడదనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగింది. బీయారెస్ ఆవిర్భావ ప్రకటన కార్యక్రమానికి కవిత ఎందుకు వెళ్లలేదు అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.