Begin typing your search above and press return to search.

ఎన్నారైల చూపంతా సౌత్ వైపేనట

By:  Tupaki Desk   |   17 Feb 2021 11:30 AM GMT
ఎన్నారైల చూపంతా సౌత్ వైపేనట
X
దేశంలోని రియాల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టటానికి ఎన్నారైలు ఎక్కడ ఆసక్తి చూపిస్తున్నారు? అన్న అంశంపై ఒక సర్వే నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా మారాయి. ఒక ఆన్ లైన్ నివేదిక చేసిన సర్వేలో కొత్త అంశాలు వెలుగుచూశాయి. దీని ప్రకారం.. ఎన్నారైల చూపంతా దక్షిణాది రాష్ట్రాల మీదనే ఉందన్న కొత్త నిజం బయటకు వచ్చింది.

2020లో 75 శాతం మంది ఎన్నారైలు దక్షిణాది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టటానికి ఆసక్తి చూపించినట్లుగా నివేదిక స్పష్టం చేసింది. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో అందుబాటులో ఉన్న ఆన్ లైన్ వేదికల్లో క్వికర్ సంస్థ ఒకటి. గత ఏడాదిలో ఎన్నారైలు పెట్టుబడులు పెట్టేందుకు సెర్చ్ చేసిన డేటా ప్రకారం ఈ నివేదికను తయారు చేశారు. దాని ప్రకారం అమెరికా.. బ్రిటన్.. యూఏఈకి చెందిన ఎన్నారైలు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని ప్రదర్శించినట్లుగా ఈ నివేదిక స్పష్టం చేసింది.

కర్ణాటక.. తమిళనాడు.. కేరళ రాష్ట్రాల్లో రియాల్టీ రంగంలో పెట్టుబడుల కోసం 75 శాతం మంది ఎన్నారైలు వెతికినట్లుగా పేర్కొంది. అదే సమయంలో 39 శాతం మంది అద్దె అపార్ట్ మెంట్ల కోసం వెతికితే.. 17 శాతం మంది ప్లాట్స్ సేల్స్ కోసం వెతికినట్లుగా పేర్కొన్నారు. అయితే.. అత్యధికంగా అంటే 82 శాతం మంది ఎన్నారైలు మాత్రం రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీల్లో పెట్టుబడుల కోసం వెతికినట్లుగా పేర్కొంది. అయితే.. ఈ నివేదికలో రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో ఎన్నారైలు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శించకపోవటం గమనార్హం.