Begin typing your search above and press return to search.

కర్ణాటక ఎన్నికలసై ఉప్పులో కాలేసిన పార్టీ అధినేత.. పాపులర్ హీరో..

By:  Tupaki Desk   |   30 March 2023 3:01 PM GMT
కర్ణాటక ఎన్నికలసై ఉప్పులో కాలేసిన పార్టీ అధినేత.. పాపులర్ హీరో..
X
ఆయన బహుభాష నటుడు. 25 ఏళ్ల కిందటే తెలుగులోనూ పాపులర్. కన్నడంలో మాస్ హీరోగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్. దర్శకత్వమూ వహించారు. బహుశా మలయాళం, తమిళంలోనూ కాలు పెట్టి ఉంటారనడంలో సందేహం లేదు. 30 ఏళ్లకు పైగా సినీ రంగంలో ఉన్నారు. మంచి నటుడు కూడా. వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ఇమేజ్ తెచ్చకున్నారు. యాంగ్రీ, యారోగెంట్ పాత్రలకు ఇప్పుడంటే అందరూ ‘‘అర్జున్ రెడ్డి’’ అంటున్నారు కానీ.. అతడు 25 ఏళ్ల కిందటే అలాంటి పాత్ర చేసి మెప్పించాడు. ఇక సొంత రాష్ట్రంలో అయితే తిరుగులేని స్టార్ డమ్. తెలుగు, తమిళ తదితర దక్షిణాది భాషల హీరోలకు ఉన్నట్లే ఆయనకూ ప్రజా సేవ చేయాలన్న కాంక్ష పుట్టింది. ఐదేళ్ల కిందట ఏకంగా పార్టీనే పెట్టారు. కానీ, అది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

పేరులో ఉత్తమ్.. తీరులో ‘‘ఉత్త’’దేనా

కన్నడ నటుడు, హీరో ఉపేంద్ర అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన తెలుగులోనూ చాలా సినిమాలు చేశారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర నటన చాలామందిని ఆకట్టుకుంది కూడా. ఇలాంటి పాత్రలెన్నో ఉపేంద్రకు కొట్టినపిండి. 1995 నుంచే ఆయన తెలుగు సినిమా హీరోకు సరిసమాన రేంజ్ లో ఉన్నారు. కాగా, ఉపేంద్ర ఆరేళ్ల కిందట.. అంటే 2017లో సరిగ్గా కర్ణాటక ఎన్నికల ముందు ఉత్తమ ప్రజాకీయ పార్టీ (Uttama Prajaakeeya Party (UPP) అంటూ పార్టీ ఏర్పాటు చేశారు. కన్నడలో ఆయనను అందరూ ‘‘ఉప్పి’’ అని పిలుస్తుంటారు. ఆ పేరు ఉచ్ఛరణలో కలిసివచ్చేలా ఉత్తమ ప్రజాకీయ పార్టీని ఏర్పాటు చేశారు.

కానీ, పేరులో ప్రజలు, రాజకీయం ఉన్నప్పటికీ అటు ప్రజలు, ఇటు రాజకీయంగా రెండింట్లో నూ మద్దతు పొందలేకపోయింది. చివరకు ఓ నామమాత్ర పార్టీగా మిగిలిపోయింది. కాగా, బుధవారం కర్ణాటక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మే 10న ఆ రాష్ట్రంలో ఒకే దశలో 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మే 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియపై ఓ రాజకీయ పార్టీ అధినేతగా, అందులోనూ అత్యంత ప్రజాదరణ ఉన్న సినీ హీరోగా ఉపేంద్రకు కనీసమైనా తెలిసి ఉండాలి. కానీ, అవేమీ ఆయనకు తెలిసినట్లుగా లేవు. దీంతో ఓ ట్వీట్ చేసి అభాసుపాలయ్యారు.

ఫలితాలకు అన్ని రోజులెందుకట?

కర్ణాటక ఎన్నికలు మే 10న జరిగి 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అంటే కేవలం మూడు రోజుల్లోనే ఫలితాలు రానున్నాయి. ఇది చాలా చాలా తక్కువ సమయం. యూపీ వంటి చోట ఐదారు దశల్లో ఎన్నికలు జరిగి ఫలితాల వెల్లడికి నెల సమయం పట్టింది. కానీ, కర్ణాటకలో స్వల్ప సమయంలోనే ఫలితాలు వస్తున్నాయి. అయితే, ఉపేంద్ర ఇదేమీ ఆలోచన చేయకుండా.. ఎన్నికలు మే 10వ తేదీ జరిగితే మే 13వ తేదీ ఫలితాలు ఎందుకు ప్రకటిస్తారు ?, ఓట్లు లెక్కించడానికి రెండు రోజుల గ్యాప్ అవసరమా అంటూ ఉపేంద్ర ట్విట్ చేశారు.

ఎన్నికలకు తేదీ ప్రకటించిన తరువాత ప్రముఖ నటుడు ఉపేంద్ర చేసిన ట్విట్ వైరల్ అయ్యింది. ఇంతటితో ఉప్పి ఆగకుండా కొన్ని గంటల తరువాత మరో ట్వీట్ చేశారు. డిజిటల్ యుగంలో ఓట్లు లెక్కించడానికి రెండు రోజులు అవసరమా ?, నాకు తెలీదు, తెలిస్తే మీరు చెప్పండి అంటూ మరో ట్విట్ చేశాడు. దెబ్బకు ఉపేంద్ర ట్వీట్ మరోసారి వైరల్ అయ్యింది. ఉపేంద్రకు మద్దతుగా ట్విట్ చేసిన వారికంటే హీరోకు క్లాస్ పీకినవాళ్లు ఎక్కువ మంది ఉన్నారు.

ఉప్పిని ఆడేసుకున్నారు..

వరుస ట్వీట్ లతో నెటిజన్లకు ఉపేంద్ర పలుచన అయిపోయారు. దీంతో ‘‘నువ్వు హీరో ఎలా అయ్యావు సార్, బుద్ధి ఉండే ట్విట్ చేశావా ? ఓ రాష్ట్రం భవిష్యత్తు అని తెలీదా ? ఒకటో తరగతి పరీక్షలు జరిగిన తరువాత వాటి ఫలితాలు వెళ్లడించడానికి స్కూల్ యాజమాన్యం నెల రోజులు తీసుకుంటుంది. అలాంటిది ఓ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ఫలితాలు వెల్లడించడానికి రెండు రోజులు తీసుకుంటే తప్పు ఏమిటి’’ అంటూ ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. ఎన్నికల ఫలితాలు ఓ రాష్ట్రంలోని ప్రజల భవిష్యత్తు అని తెలీదా అని ఉపేంద్రను నిలదీశారు.

ఈవీఎం యంత్రాలను భద్రపరచడానికి, ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చెయ్యాలని, అందుకు రెండు రోజులు సమయం అవసరం అని కూడా తెలీదా, నువ్వు హీరో ఎలా అయ్యావు. దర్శకుడు ఎలా అయ్యావు అంటూ చీవాట్లు పెట్టారు. పోలింగ్ జరిగిన రోజే నువ్వు అన్ని ఈవీఎంలు ఒకచోటకు తరలించు, ఆరోజే ఓట్ల లెక్కింపుకు అధికారులు చర్యలు తీసుకుంటారు. అసలు బుద్ది ఉండే ట్విట్ చేశావా ? అంటూ ఓ నెటిజన్ అడుకున్నాడు. మొత్తం మీద కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించిన తరువాత హీరో ఉపేంద్ర చేసిన ట్విట్ తో అతన్ని సోషల్ మీడియాలో ఆడుకునే వాళ్లు ఎక్కువ అయ్యారు.