Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ హై కమాండ్...ఒక బ్రహ్మ పదార్ధం

By:  Tupaki Desk   |   18 May 2023 2:57 PM GMT
కాంగ్రెస్ హై కమాండ్...ఒక బ్రహ్మ పదార్ధం
X
కాంగ్రెస్ హై కమాండ్ అంటే ఒక్కరే ఉండేవారు ఒకనాడు. అది ఇందిరాగాంధీ అయినా రాజీవ్ అయినా నిన్నటిదాకా సోనియా అయినా. వారిదే డెసిషన్. వారే ఫైనల్. కానీ ఇపుడు హై కమాండ్ అంటే మూడు గాంధీ ఫేసులు కనిపిస్తున్నాయి. ఇక వారి మధ్యన పార్టీ అధికారం చక్కర్లు కొడుతూంటే మధ్యలో ఏఐసీసీ ప్రెసిడెంట్ అని మల్లికార్జున ఖర్గెని తెచ్చి పెట్టారు.

ఆయనను పార్టీ ఎన్నుకుంది. నిజానికి చూస్తే ఆయన మాట ఫైనల్ కావాలి. కానీ ఆయన దగ్గర కూడా డెసిషన్ ఉండదు. అటు సోనియాగాంధీతో కానీ ఇటు రాహుల్ గాంధీతో కానీ మరో వైపు ప్రియాంకా గాంధీతో కానీ భేటీలు వేయాల్సిందే. చిత్రమేంటి అంటే ఈ ముగ్గురు గాంధీలు కూడా ఏకాభిప్రాయంతో లేరు.

అందుకే కర్నాటక సీఎం ఎంపిక చాలా సుదీర్ఘ ప్రక్రియగా సాగింది అని అంటున్నారు. ఇక సిద్ధరామయ్య విషయంలో రాహుల్ గాంధీ మొగ్గు చూపిస్తే సోనియా గాంధీ ప్రియాంకా గాంధీ ఇద్దరూ డీకే శివకుమార్ కి ఓటేశారు అని ప్రచారం సాగింది. అంతే కాదు మల్లికార్జున ఖర్గే సైతం తన శిష్యుడు అయిన డీకేకే ఓటేశారుట. అంటే మెజారిటీ డీకే వైపు ఉంది అన్న మాట.

అయినా రాహుల్ గాంధీ కోరిక మేరకు సిద్ధరామయ్యకు తొలి చాన్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ రాహుల్ మాట నెగ్గింది అన్న మాట. కాంగ్రెస్ హై కమాండ్ అంటే అలా ఎవరు ఫైనల్, ఎవరిది కీలక నిర్ణయం అవుతుంది. ఎవరు చెబితే ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ పడుతుంది అన్నది బహుశా కర్నాటక నుంచి ఢిల్లీకి వెళ్ళి రోజుల తరబడి గడిపిన కాంగ్రెస్ నేతలకే అర్ధం కాదేమో అనిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ నెల 13న ఫలితాలు వస్తే వారం రోజుల తరువాత కొత్త సీఎం ప్రమాణం చేయడం అంటే అధినాయకత్వం సీఎం సెలెక్షన్ విషయంలో ఎంతటి కుస్తీ చేసిందో అర్ధమవుతోంది. ఒక విధంగా కాంగ్రెస్ లో హై కమాండ్ మీద లోకల్ లీడర్ల ఆధిపత్యం పెరుతోంది అనడానికి ఇంతటి సుదీర్ఘ చర్చలు రోజుల తరబడి భేటీలే తార్కాణం అని అనుకోవాలి.

ఇక కాంగ్రెస్ అధినాయకత్వం ఒకప్పటి మాదిరిగా వ్యవహరించి ఉన్నట్లు అయితే సీల్డ్ కవర్ లో తన సీఎం ని ఎంపిక చేసి కధ కర్నాటకలోనే ముగించేసి ఉండేది కానీ కాంగ్రెస్ హై కమాండ్ అన్నది అంటే ఇపుడు బ్రహ్మ పదార్ధం అయిపోయింది. ఒక విషయం మీద అందునా ప్రజలు ఏరి కోరి బంపర్ మెజారిటీతో గెలిపించిన కర్నాటక వంటి పెద్ద స్టేట్ కి సీఎం పదవి ఎంపిక మీద ఇంతలా కసరత్తు చేయడం ద్వారా హై కమాండ్ తన బలహీనతను చాటుకుందా అన్న చర్చ కూడా వస్తోంది.

ఒకే ఒక్క స్టేట్ కే ఇలాంటి పరిస్థితి ఉంటే రేపటి రోజున 2024 ఎన్నికల్లో లోక్ సభ అభ్యర్ధులను ఎంపిక చేసుకోవాలి. పొత్తులు ఉంటే వారితో చర్చలు జరిపి పార్టీని లాభం కలిగేలా చేసుకోవాలి. పార్టీలో అసంతృప్తులు అసమ్మతులు లేకుండా కాపు కాసుకోవాలి, మోడీ అమిత్ షా వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించాయి.

ఇవన్నీ కాంగ్రెస్ హై కమాండ్ అనబడే వారికి అవుతుందా అన్న ధర్మ సందేహాలు వస్తున్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ లో గట్టి నాయకత్వం ఆవశ్యకతను అయితే కర్నాటక సీఎం సెలెక్షన్ ఎపిసోడ్ తెలియచేస్తోంది. మరి ఆ స్ట్రాంగ్ లీడర్ రాహుల్ అవుతారా ప్రియాంకా అవుతారా అన్నది కాలం నిర్ణయిస్తుంది. అప్పటిదాకా ముగ్గురు గాంధీల చుట్టూ పార్టీ తిరగడమే జరిగే తంతుగా కనిపిస్తోంది.