Begin typing your search above and press return to search.

టీవీ, ఫ్రిజ్ ఉంటే.. రేషన్ కార్డు క‌ట్‌! ప్ర‌క‌టించిన‌ ప్రభుత్వం!

By:  Tupaki Desk   |   16 Feb 2021 3:33 AM GMT
టీవీ, ఫ్రిజ్ ఉంటే.. రేషన్ కార్డు క‌ట్‌! ప్ర‌క‌టించిన‌ ప్రభుత్వం!
X
రేష‌న్ కార్డు అనేది దారిద్ర రేఖ‌కు దిగువన ఉన్నవారికి అందించే ఉపశమనం. దాన్ని తాజాగా నిర్వచిస్తూ కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టీవీ, ఫ్రిజ్‌, ద్విచక్ర వాహనం ఉన్న‌వారికి రేషన్‌ కార్డు ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది. బీపీఎల్‌ కార్డుల మంజూరు విషయంలో రాష్ట్ర‌ ప్రభుత్వం మరింత కఠినంగా ఉండ‌బోతోంద‌ని ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖమంత్రి ఉమేష్‌ కత్తి వెల్ల‌డించారు.

సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేర‌కు ప్రకటన చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా రేష‌న్ కార్డును పొంది ఉన్నార‌ని, వారు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్‌ సరుకులను ఉపయోగించుకున్నారని అన్నారు. దీనివ‌ల్ల నిజ‌మైన బ‌ల‌హీనుల‌కు సరుకులు చేరడంలేదని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునే ఉద్ధేశంతోనే ప్రభుత్వం రేషన్‌ సరఫరా చేస్తోందని అన్న ఉమేస్‌.. త్వ‌ర‌లోనే నిజ‌మైన‌ అర్హుల జాబితాను రూపొందిస్తామని తేల్చి చెప్పారు.

ఈ మేర‌కు ప్ర‌ధాన‌మైన అర్హ‌త‌ల‌ను కూడా ఆయ‌న వివ‌రించారు. తాజా నిబంధ‌న‌ల ప్ర‌కారం.. 1.20 లక్షల వార్షిక ఆదాయం దిగువ‌న ఉన్న వారికి మాత్ర‌మే రేష‌న్ కార్డు ద‌క్కుతుంద‌న్నార‌ను. అదేవిధంగా.. టీవీ, ఫ్రిజ్‌, ద్విచక్ర వాహనం ఉన్న‌వారు వెంట‌నే రేషన్‌ కార్డును వదులుకోవాలన్నారు. అంతేకాదు.. ఈ జాబితాలో ఉన్న‌వారంతా.. మార్చి 31 వరకు కార్డును వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి.

కాగా.. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేస్తోంది. టీవీ, ఫ్రిజ్‌ అనేవి నేడు నిత్యావసర వస్తుల జాబితాలో చేరిపోయాయని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు. ఈ కార‌ణాల‌ను చూపుతూ రేష‌న్ కార్డు తొల‌గించ‌డం స‌రికాద‌ని అంటున్నారు.