Begin typing your search above and press return to search.

సిద్దూకు షాకిచ్చిన కాంగ్రెస్.. రెండో సీటుకు చెక్ చెప్పేశారు

By:  Tupaki Desk   |   16 April 2023 1:00 PM GMT
సిద్దూకు షాకిచ్చిన కాంగ్రెస్.. రెండో సీటుకు చెక్ చెప్పేశారు
X
ఏదైతే అదైంది. సాహసోపేత నిర్ణయాలను తీసుకోవటం.. వాటిని అమలు చేయటం మిగిలిన రంగాల్లో ఎలా ఉన్నా.. రాజకీయాల్లో అంత తేలికైన విషయం కాదు. అందునా కీలక నేతల విషయంలో అధినాయకత్వం తీసుకునే నిర్ణయాల్లో ఏ మాత్రం తేడా కొట్టినా.. అందుకు జరిగే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ అలాంటివేమీ పట్టించుకోకుండా కీలక నిర్ణయాలు తీసుకోవటం అంత తేలికైన విషయం కాదు. మిగిలిన సందర్భాలు ఎలా ఉన్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు సాధ్యం కాదనుకున్న నిర్ణయాల్ని తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ.. కీలక నేతలు రెండు స్థానాల నుంచి పోటీ చేయాలనుకున్నవేళ.. అందుకు అవకాశం ఇవ్వని తీరు ఆసక్తికరంగా మారింది.

గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సిద్దరామయ్యకు వరుణ స్థానం నుంచి పోటీ చేసేందుకు వీలుగా టికెట్ కన్ఫర్మ్ చేసిన కాంగ్రెస్.. ఆయన రెండో స్థానం నుంచి కూడా పోటీ చేయాలన్న ఆశల మీద మాత్రం నీళ్లు జల్లింది. సిద్దూకు సెకండ్ స్థానం ఖరారు ఖాయమని అందరూ భావించారు. అందుకు భిన్నంగా తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆయన పేరు లేకపోవటంతో.. సింగిల్ స్థానం నుంచి పోటీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక.. బీజేపీని వదిలేసి..ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రాష్ట్ర మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావడికి టికెట్ కేటాయించి.. అథని స్థానం నుంచి బరిలోకి దింపుతున్నట్లుగా తాజాగా విడుదల చేసిన జాబితా స్పష్టం చేసింది.

మొత్తం 43 మందితో మూడో జాబితాను ప్రకటించిన కాంగ్రెస్.. ఈ సందర్భంగా పలు ఆసక్తికర నిర్ణయాల్ని తీసుకున్న వైనం కనిపిస్తోంది. సిద్దరామయ్య తాను రెండు స్థానాల నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే పలు వేదికల మీద చెప్పటమే కాదు.. తాను పోటీ చేసే రెండో స్థానం కోలార్ అని కూడా చెప్పుకున్నారు. అయినప్పటికీ.. కాంగ్రెస్ టికెట్ కేటాయించకపోవటమే కాదు.. ఆ స్థానం నుంచి కొథూర్ జి మంజునాథ్ అనే అభ్యర్థిని ప్రకటించటం ద్వారా.. సిద్దూ ఆశల మీద నీళ్లు జల్లేసింది.

కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి మూడు జాబితాల్లో 209 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మరో 15 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొదటి జాబితాలో 124 మంది ఉండగా.. రెండో జాబితాలో 42, మూడో జాబితాలో 43 మంది అభ్యర్థులతో జాబితాలను విడుదల చేసింది. మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా కుమారుడు నివేదిత్ అల్వాకు కుష్టూ స్థానం నుంచి టికెట్ ను ఖరారు చేసింది. మే 13 విడుదలయ్యే ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త మార్పునకు కారణమవుతుందన్న మాట వినిపిస్తోంది. అధికార బీజేపీ.. విపక్ష కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా సాగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.