Begin typing your search above and press return to search.

కర్ణాటక ఎన్నికలు.. హైదరాబాద్‌ లగ్జరీ హోటళ్లలో పార్టీల క్యాంపులు!

By:  Tupaki Desk   |   13 May 2023 11:52 AM GMT
కర్ణాటక ఎన్నికలు.. హైదరాబాద్‌ లగ్జరీ హోటళ్లలో పార్టీల క్యాంపులు!
X
కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 13న వెలువడుతున్నాయి. ఎగ్జిట్‌పోల్స్‌ ఊహించినట్టే కాంగ్రెస్‌ పార్టీ అధికారం దిశగా సాగుతోంది. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే 113 సీట్లు అవసరం కాగా కాంగ్రెస్‌ 8 సీట్లు అదనంగా అంటే 121 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 71 సీట్లలో, జేడీఎస్‌ 25, ఇతరులు ఏడు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు పోలింగ్‌ జరగగా.. 36 కేంద్రాల్లో కౌంటింగ్‌ కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ముందంజలో ఉండటంతో ఇప్పటికే ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 113కు అటూఇటుగా కాంగ్రెస్‌ పార్టీ సీట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా ఆ పార్టీ నేతలు ఇండిపెండెంట్లతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.

అలాగే బీజేపీ అధికారంలోకి రావడానికి జేడీఎస్‌ తో కలిసి ప్లాన్‌ బీ అమలు చేసే ప్రమాదం ఉండటంతో కాంగ్రెస్‌ తన పార్టీ ఎమ్మెల్యేలను రిస్టార్ట్స్‌ కు తరలిస్తోంది. అలాగే జేడీఎస్‌ సైతం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ కు తన ఎమ్మెల్యేలను తరలించడానికి ఏర్పాట్లు చేస్తోంది.

ఇప్పటికే జేడీఎస్‌ నేతలు హైదరాబాద్‌ లో పార్క్‌ హయత్, తాజ్‌ కృష్ణా తదితర ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో లగ్జరీ రూములను భారీ ఎత్తున బుక్‌ చేసిందని తెలుస్తోంది.

ఎన్నికల ఫలితాలు ముగిసేనాటికి మ్యాజిక్‌ ఫిగర్‌ 113కు కాంగ్రెస్‌ కు సీట్లు తగ్గితే తమ మద్దతు ఆ పార్టీకి అవసరమవుతుందని జేడీఎస్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలను తమ చేయి దాటకుండా చూసుకుంటోంది. ఉదయం 11.40 గంటల సమయానికి జేడీఎస్‌ 25 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు పక్క పార్టీల్లోకి జంప్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల ఫలితాలను బట్టి గెలిచిన ఎమ్మెల్యేలను జేడీఎస్‌ అధినేత కుమారస్వామి హైదరాబాద్‌ కు తీసుకొస్తారనే తెలుస్తోంది.

ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌లో రూమ్స్‌ బుక్‌ అయ్యాయి. బంజారాహిల్స్‌ లోని తాజ్‌ కృష్ణాలో 18 రూమ్స్, పార్క్‌ హయత్‌లో 20, నోవోటల్‌ లో 20 రూమ్స్‌ కర్ణాటక వ్యక్తుల మీద ఒక రోజు ముందుగానే బుక్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఇంకా మరికొన్ని హోటల్స్‌ లోనూ రూములు బుక్‌ చేసినట్లు సమాచారం. అయితే ఏ పార్టీ నుంచి రూమ్స్‌ బుక్‌ చేశారో అనే విషయంపై తమ వద్ద సరైన సమాచారం లేదని హోటల్‌ యాజమాన్యాలు వివరిస్తున్నాయి.