Begin typing your search above and press return to search.

బీజేపీలో పెరిగిపోతున్న టెన్షన్

By:  Tupaki Desk   |   9 May 2023 11:19 AM GMT
బీజేపీలో పెరిగిపోతున్న టెన్షన్
X
పోలింగుకు 36 గంటల ముందు కర్నాటక బీజేపీలో టెన్షన్ అమాంతం పెరిగిపోయింది. దీనికి కారణం ఏమిటంటే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతుంటుందని లింయాగత్ కుల సంఘం నేతలు చేసిన ప్రకటనే.

కర్నాటక రాజకీయాల్లో మొదటినుండి లింగాయతులు, ఒక్కలిగలదే కీలక పాత్ర. రెండు సామాజికవర్గాల్లో ఒకళ్ళు ఒకపార్టీ వైపుంటే మరో సామాజికవర్గం ఇంకో పార్టీవైపుంటుంది. అయితే రెండు సామాజికవర్గాలు ఒకే పార్టీకి మద్దతుగా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ అది చాలా అరుదనే చెప్పాలి.

బుధవారం మొదలయ్యే పోలింగులో ఏ సామాజికవర్గం ఓట్లు ఏపార్టీకి అనుకూలంగా పడతాయో అనే గందరగోళం పెరిగిపోతోంది. ముఖ్యంగా లింగాయత్ సామాజవకవర్గం ఓట్లపైనే ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ దృష్టిపెట్టాయి.

ఎందుకంటే లింగాయత్ సామాజికవర్గం ఓట్లు సుమారు 16 శాతముంటుంది. వీళ్ళల్లో మెజారిటి ఏపార్టీకి అనుకూలంగా వేస్తారో ఆ పార్టీ గెలుపుకు దగ్గరవుతుంది. మిగిలిన విషయాన్ని ఒక్కలిగలతో పాటు ఎస్సీ, అగ్రవర్ణాలు, ముస్లింల ఓట్లు డిసైడ్ చేస్తాయి.

ఇపుడు సమస్య ఏమివచ్చిందంటే లింగాయతుల్లో యడ్యూరప్ప లాంటి సినియర్లు బీజేపీ వైపే ఉన్నారు. అయితే టికెట్లు నిరాకరించిన కారణంగా లింగాయతుల్లో జగదీష్ శెట్టర్ లాంటి కొందరు కీలకనేతలు బీజేపీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్ లో చేరి పోటీచేస్తున్నారు. దాంతో లింగాయతుల్లో చీలిక తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది. సరిగ్గా ఈ సమయంలోనే లింగాయత్ రాష్ట్ర సంఘం కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది.

దాంతో బీజేపీలోని యడ్యూరప్ప లాంటి నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే అర్జంటుగా బీజేపీకి మద్దతుగా ఉండే కొందరు లింగాయత్ స్వాములతో మద్దతు ప్రకటించాలని అనుకున్నారు. అయితే అది సాధ్యంకాలేదు. దాంతో యడ్యూరప్ప మాట్లాడుతు స్వాములంతా బీజేపీకి మద్దతు ప్రకటించారని చెప్పుకుంటున్నారు.

కర్నాటక ఎన్నికల్లో మొదటినుండి మఠాధిపతులు, పీఠాలు, స్వాముల ప్రభావం ఎక్కువనే చెప్పాలి. సో, తాజా పరిణామాల కారణంగా మిగిలిన సామాజికవర్గాల మాటెలాగున్నా లింగాయతుల్లో మాత్రం బాగా గందరగోళం పెరిగిపోతోంది. దీని ప్రభావం బీజేపీపైన పడుతోంది. అసలే బీజేపీకి గెలుపు అంతంత మాత్రమని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. దీనిమీద లింగాయతుల పోటొకటి. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.