Begin typing your search above and press return to search.

శెట్టర్, పాటిల్, కట్టి... యడ్డీ కుర్చీ నిలిచేనా?

By:  Tupaki Desk   |   30 May 2020 5:30 PM GMT
శెట్టర్, పాటిల్, కట్టి... యడ్డీ కుర్చీ నిలిచేనా?
X
బీజేపీ సీనియర్ నేత, కర్ణాటకలో బీజేపీ అలుపెరగని బాటసారి బీఎస్ యడియూరప్పకు ఇప్పుడు నిజంగానే పెద్ద కష్టం వచ్చి పడింది. అసలే కరోనా వ్యాప్తితో నానా ఇబ్బందులు పడుతున్న కర్ణాటకలో ఇప్పుడు యడ్డీపై రేగిన అసమ్మతి మరింత కలకలం రేపుతోంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యారంటూ సొంత పార్టీ నుంచే పెద్ద ఎత్తున వినిపిస్తున్న విమర్శలను ఎలాగోలా భరిస్తూనూ సాగుతున్న యడ్డీ... ఇప్పుడు ఏకంగా అసమ్మతిని ఎలా కంట్రోల్ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. అసమ్మతి అంటే ఏదో... ఒకటో, రెండో శిబిరాలు ఏర్పడ్డాయనుకుంటే ఓకే గానీ.. ఏకంగా మూడు అసమ్మతి కూటములు ఎంట్రీ ఇచ్చేసి ఎప్పుడెప్పుడు యడ్డీని కుర్చీ నుంచి దించేద్దామా? అంటూ వ్యూహాలు పన్నుతున్న వేళ... సంక్షోభాలను అలవోకగా చల్లార్చిన నేర్పు కలిగిన యడ్డీ తాజా అసమ్మతి నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

యడ్డీపై రేగిన అసమ్మతి విషయానికి వస్తే... కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో విఫలమైన యడ్డీని తక్షణమే సీఎం కుర్చీ నుంచి దించేసి ఆ స్థానంలో కొత్త నేతను కూర్చోబెట్టాలంటూ బీజేపీకే చెందిన సీనియర్ నేత బసన్న గౌడ పాటిల్ గట్టిగానే గళం ఎత్తారు. అంతేకాకుండా యడ్డీని సీఎం కుర్చీ నుంచి తక్షణమే దించేసి అందులో తాను కూర్చోవాలన్న వ్యూహంతో కదులుతున్న పాటిల్... ఈ వ్యూహంలో దూడుకుగా వ్యవహరిస్తున్నారట. అదే సమయంలో బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ కూడా యడ్డీ సర్కారును కూర్చేందుకు తనదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారట. పాటిల్ మాదిరే శెట్టర్ కూడా తన వర్గం ఎమ్మెల్యేలతో ఏకంగా క్యాంపు నిర్వహణకు కూడా సిద్ధయవుతున్నట్లుగా వినిపిస్తున్న కథనాలు కన్నడ నాట పెను కలకలమే రేపుతున్నాయి. ఇక పాటిల్, శెట్టర్ లకు తామేనీ తక్కువ కాదన్నట్లుగా ఎంట్రీ ఇచ్చిన మరో సీనియర్ నేత ఉమేశ్ కట్టి కూడా వన వర్గంతో సంప్రదింపులు మొదలెట్టేశారట. తన వర్గంగా ఉన్న 15 మంది ఎమ్మెల్యేలతో పాటు మరింత మందిని తన కూటమిలోకి ఆహ్వానించే క్రమంలో కట్టి తనదైన స్పీడును పెంచేస్తున్నారట.

మొత్తంగా తనకు అసమ్మతిగా రంగంలోకి దిగిన మూడు కూటములను యడ్డీ ఇప్పుడు ఎలా ఎదుర్కొంటారన్నదే అసలు సిసలు ప్రశ్నగా వినిపిస్తోంది. గతంలో పలు సంక్షోభాలను చవిచూసిన యడ్డీ... తాజాగా ఎంట్రీ ఇచ్చిన అసమ్మతి గళాలను నిలువరించే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు కర్ణాటకలోని తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. అసమ్మతి గళాలకు లొంగి యడ్డీని సీఎం సీటు నుంచి దించేసేంత ధైర్యం బీజేపీ చేయకపోవచ్చన్నది విశ్లేషకుల మాటగా వినిపిస్తోంది. ఇప్పటికే కుమారస్వామి సర్కారును కూల్చేందుకు నానా తిప్పలు పడ్డ బీజేపీ అధిష్ఠానం..ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న నిరసన గళాల ఆధారంగా యడ్డీని సీఎం సీటు నుంచి దించేంత ధైర్యం చేయకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా యడ్డీ సేఫ్ సైడ్ గానే ఉన్నట్లుగానే కనిపిస్తున్నా.. ఒకేసారి ముగ్గురు అసమ్మతి నేతలు ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటే... యడ్డీకి దినదినగండమేనని చెప్పక తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది.