మనిషి రూపంలో ఉండే మృగాన్ని ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నకు సగటు మనిషి చెప్పే సమాధానం ఒకలా ఉంటే.. మానవతామూర్తులుగా చెప్పుకునే హక్కుల నేతలు.. విశాల హృదయం ఉందంటూ చెప్పే వారి జవాబు ఇంకోలా ఉంటుంది. చేసిన నేరాన్ని.. దాన్ని తీవ్రతను.. జరిగిన అన్యాయాన్ని అస్సలు పట్టించుకోని హక్కులు నేతలు.. ఎవరైనా దుర్మార్గుడికి ఉరిశిక్ష వేస్తే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అయ్యోపాపం అంటూగగ్గోలు పెట్టేస్తారు.
ఇప్పటికైతే హక్కుల నేతలు నోరు విప్పలేదు కానీ.. కరీంనగర్ కోర్టు తీర్పు గురించి తెలిస్తే మాత్రం వారు గళం విప్పటం ఖాయం. కానీ.. సదరుకోర్టు సంచలన తీర్పు ఇవ్వటానికి కారణం చూస్తే.. సబబే అన్న భావన కలగటం ఖాయం. ఈ ఏడాది ఫిబ్రవరి 28న కరీంనగర్ జిల్లాలోని కాటారం మండలం దామెరకుంట గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన జక్కుల వెంకటస్వామి అత్యాచారం చేశాడు.
అంతటితో ఆగని ఆ మృగం.. తాను చేసిన దుర్మార్గం బయటకు రాకుండా ఉండేందుకు ఆ చిన్నారిని అత్యంత దారునంగా హతమార్చాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసును విచారించిన కోర్టు.. స్వల్ప వ్యవధిలోనే విచారణను పూర్తి చేసి తాజాగా ఈ రోజు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడ్ని దోషిగా నిర్దారిస్తూ.. అతడికి ఉరిశిక్ష విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు జిల్లా జడ్జి నిందితుడికి ఉరిశిక్ష విధించారు. కరీంనగర్ లో ఉరిశిక్ష వేయటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఇలాంటి మానవ మృగానికి ఉరిశిక్షే సరైన శిక్ష అనటంలో మరో మాట లేదనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/