Begin typing your search above and press return to search.

ప్రభుత్వ విప్ కే షాక్

By:  Tupaki Desk   |   14 March 2023 11:06 AM GMT
ప్రభుత్వ విప్ కే షాక్
X
దొంగఓట్లు చేర్పించారని కొన్నిచోట్ల ఆరోపణలు. తమ ఓట్లు గల్లంతయ్యాయని మరొకచోట గోల. ఇలాంటి వ్యవహారాలను పక్కనపెట్టేస్తే ఏకంగా అధికారపార్టీ ఎంఎల్ఏ, ప్రభుత్వ విప్ ఓటే గల్లంతైన విషయం వెలుగుచూసింది. కుటుంబసభ్యులతో కలిసి ఎంఎల్సీ ఎన్నికల్లో ఓట్లేయటానికి వచ్చిన తర్వాత తన ఓటు గల్లంతయ్యాయని తెలుసుకున్న విప్ షాక్ కు గురయ్యారు. ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖపట్నం జిల్లాలోని చోడవరం సీనియర్ ఎంఎల్ఏ కరణం దర్మశ్రీ ఓటే గల్లంతైపోయింది.

ఆయనతో పాటు మరో 12 మంది కుటుంబసభ్యుల ఓట్లు కూడా ఓటర్లజాబితాలో ఎక్కడా కనబడలేదు. ఎన్నిసార్లు జాబితాను తిరగేసి చూసినా తమపేర్లు కనబడకపోవటంతో చేసేది లేక ఎంఎల్ఏ, కుటుంబసభ్యులు ఉసూరుమంటు వెనక్కుతిరిగి వెళ్ళిపోయారు.

ఇంతకీ జరిగింది ఏమిటంటే ఎంఎల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపుకోసం ధర్మశ్రీ చాలా కష్టపడ్డారు. పనిలోపనిగా తనతో పాటు కుటుంబసభ్యుల ఓట్ల రెన్యువల్ కోసం అవసరమైన ఫారంలను నింపి మరీ అధికారులకు ఇచ్చారట.

చోడవరం మండలంలోని అంబేడుపురం గ్రామంలోనే ధర్మశ్రీ కుటుంబం చాలాకాలంగా ఓట్లేస్తున్నారు. ఎంఎల్సీ ఎన్నికల కోసం అందరి ఓట్లను నమోదు చేసుకోవాలని అధికారులు ఎంఎల్ఏతో పాటు ఆయన కుటుంబసభ్యలను కోరారు. అధికారులు కోనినట్లే ఎంఎల్ఏతో పాటు కుటుంబసభ్యులంతా అవసరమైన ఫారాలను నింపిచ్చారు. తాము ఫారాలను నింపిచ్చాం కాబట్టి ఓటు హక్కు ఆటోమేటిగ్గా వచ్చేస్తుందని ఎంఎల్ఏ అనుకున్నారు. అధికారులు కూడా ఎంఎల్ఏకి అలాగే భరోసా ఇచ్చారు.

దాంతో ఎంఎల్ఏతో పాటు తమ్ముళ్ళు, బావమరుదులంతా ఎన్నికల ప్రచారంలో ముణిగిపోయారు. అంతా అయిపోయిన తర్వాత సోమవారం ఓట్లేద్దామని పోలింగ్ కేంద్రానికి వెళ్ళారు. తీరాచూస్తే తమ ఓట్లు లేవని అక్కడి అధికారులు చెప్పటంతో అందరికీ షాక్ కొట్టినట్లయ్యింది.

ఓట్లు లేవని తేలిపోయిన తర్వాత అక్కడ ఎంతసేపు వాదించినా ఉపయోగం లేదని అర్ధమైపోయి చేసేదిలేక అందరు వెనక్కు వెళ్ళిపోయారు. అధికారపార్టీ ఎంఎల్ఏ, ప్రభుత్వ విప్ అయిన కరణం ధర్మశ్రీ తో పాటు ఆయన కుటుంబసభ్యుల 12 ఓట్లే గల్లంతైపోయినపుడు ఇక మామూలు జనాల ఓట్లు గల్లతవ్వటంలో ఆశ్చర్యమేముంది ?



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.