Begin typing your search above and press return to search.

వైసీపీ కీలక నేతకు ఈసారి జెల్లకొట్టేది వీరేనా?

By:  Tupaki Desk   |   25 May 2023 1:20 PM GMT
వైసీపీ కీలక నేతకు ఈసారి జెల్లకొట్టేది వీరేనా?
X
కొడాలి నాని పరిచయం అక్కర్లేని పేరు. దివంగత నందమూరి హరికృష్ణకు అనుచరుడిగా, తెలుగు యువత నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన కొడాలి నాని ఆ తర్వాత హరికృష్ణ తనయుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ పంచన చేరారు. జూనియర్‌ సిఫారసుతో 2004లో గుడివాడ టీడీపీ టికెట్‌ దక్కించుకున్న కొడాలి నాని ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో గెలిచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రావి వెంకటేశ్వరరావును కాదని చంద్రబాబు..కొడాలి నానికి టికెట్‌ ఇచ్చారు. ఈ క్రమంలో 2009లోనూ కొడాలి నాని టీడీపీ తరఫున గెలుపొందారు. ఇక 2014, 2019ల్లో వైసీపీ తరఫున పోటీ చేసి మొత్తం నాలుగుసార్లు గుడివాడ నుంచి కొడాలి నాని విజయం సాధించారు.

కాగా గుడివాడ నియోజకవర్గంలో అన్ని సామాజికవర్గాల ప్రభావం ఉంది. కమ్మలు, కాపులు, ఎస్సీ, బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గం ఓటర్లు 35 వేల నుంచి 40 వేల వరకు ఉన్నారు. వీరిలో అత్యధికులు 2019 వరకు కొడాలి నానితోనే ఉన్నారు.

కొడాలి నాని కూడా దివంగత వంగవీటి రంగా తనయుడు రాధాకృష్ణకు ప్రాణస్నేహితుడిగా వ్యవహరిస్తున్నారు. రాధాను గుడివాడకు తీసుకొచ్చి ఆయన చేత వంగవీటి రంగా విగ్రహాలను ఆవిష్కరింపజేశారు. ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కాపు సామాజికవర్గంపైనే కొడాలి నాని ఆధారపడి ఉన్నారు.

అయితే 2024లో మాత్రం కాపులు కొడాలి నానికి జెల్లకొట్టే పరిస్థితి ఉందని టాక్‌ నడుస్తోంది. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ లపై తీవ్ర ఘాటైన విమర్శలు చేస్తున్న కొడాలి నానిని ఓడించడానికి అటు టీడీపీతోపాటు ఇటు జనసేన పార్టీ కూడా కంకణం కట్టుకుని ఉన్నాయని అంటున్నారు.

ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ పై కొడాలి నాని చేస్తున్న విమర్శలను కాపు సామాజికవర్గం తట్టుకోలేకపోతోందని టాక్‌ నడుస్తోంది. అందులోనూ కొడాలి నాని కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. దీంతో సహజంగానే కాపులు కొడాలి నానిపై మండిపడుతున్నట్టు తెలుస్తోంది.

కొడాలి నాని సైతం గతంలో కొంతమంది తన సహచరులు, అనుచరులు పవన్‌ కల్యాణ్‌ ను విమర్శించవద్దని కోరారని ఒక మీడియా సమావేశంలో చెప్పడం గమనార్హం.

కాపులు తనకు వచ్చే ఎన్నికల్లో జెల్లకొట్టే ప్రమాదం ఉందని తెలిసే కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణలు, ఆయన జయంతి, వర్థంతులను ఘనంగా నిర్వహిస్తున్నారనే టాక్‌ నడుస్తోంది.

అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ–జనసేన పార్టీ పొత్తు ఖరారైన నేపథ్యంలో కొడాలి నాని గెలుపుపై సందేహాలు ముసురుతున్నాయి. తమపై బూతులతో విరుచుకుపడుతున్న కొడాలి నానికి ఎలాగైనా చెక్‌ పెట్టాలని అటు టీడీపీ, ఇటు జనసేన కంకణం కట్టుకోవడంతో ఈసారి కొడాలి గెలుపు అంత సులువు కాదని అంటున్నారు. అందులోనూ ఆయనకు ఇన్నాళ్లు అండగా ఉన్న కాపు సామాజికవర్గం ఈసారి ఆయనకు సహకరించే పరిస్థితి లేదని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.