Begin typing your search above and press return to search.

రాజమండ్రీ రాజకీయం : కాపు బ్రాండ్ కోసం ...

By:  Tupaki Desk   |   31 Oct 2022 1:30 AM GMT
రాజమండ్రీ రాజకీయం :  కాపు బ్రాండ్ కోసం ...
X
ఏపీలో ఇపుడు రాజకీయాలతో పాటు కుల సమీకరణలు కూడా తోడు అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కులాలు చాలా కీలకమైన ఫ్యాక్టర్ గా పనిచేస్తాయి అన్నది అంతా నమ్ముతున్నారు. ఏపీలో కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. కాపు ఓట్లు ఏ వైపు టర్న్ అయితే వారిదే రాజ్యాధికారం అన్నది తెలిసిందే. దాంతో పాటు జనసేన టీడీపీ పొత్తు కూడా కలవరపెడుతున్న అంశం.

దాంతో వైసీపీ ఎన్నడూ లేని విధంగా కుల సమావేశాలు పెడుతోంది. కొద్ది రోజుల క్రితం బీసీలతో ఆత్మీయ సమావేశాలు పెట్టిన ఆ పార్టీ ఇపుడు కాపులతో ఒక కీలకమైన మీటింగ్ ని ఏర్పాటు చేస్తోంది. రాజమండ్రీ వేదికగా కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నామినేటెడ్ కార్పోరేషన్ల చైర్మన్లు, కీలక నేతలు అంతా కలసి పెద్ద సంఖ్యలో ఈ మీటింగ్ కి హాజరు అవుతున్నారు.

ఈ సందర్భంగా కాపులకు మేమే బ్రాండ్ అంబాసిడర్ అని వైసీపీ గట్టిగా చెప్పబోతోంది. ఎన్నడూ లేని విధంగా వైసీపీలో 27 మంది కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే అయిదుగురు మంత్రులు ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీలు, ఎంపీలు, సహా వివిధ పదవులలో ఉన్న వారు ఉన్నారు. ఈ చిట్టా అంతా అక్కడ బయటపెట్టి కాపులు అత్యధిక శాతం మద్దతు మాకే అని వైసీపీ గట్టిగా చెప్పబోతోంది. అలాగే కాపులకు న్యాయం చేసే పార్టీ తమదే అని జబ్బలు చరచబోతోంది.

గతంలో చంద్రబాబు సర్కార్ చూసినా ఇపుడు తమ ప్రభుత్వం చూసినా కాపు ఎమ్మెల్యేల సంఖ్య తమదే ఎక్కువ అని కూడా పక్కా క్లారిటీగా వివరించబోతోంది. అలాగే మంత్రి పదవులు, కీలక శాఖలతో పాటు అత్యధిక రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీగా వైసీపీ మాత్రమే ఉందని కూడా వెల్లడించబొతోంది. కాపు ఓట్లతో తమ వాటాను పదిలపరచుకోవడంతో పాటు జనసేన వైపుగా టీడీపీకి ఓట్లు బదలాయింపు కాకుండా చాలా వ్యూహాత్మకంగా ఈ సమావేశం నిర్వహితున్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి, కాపు నేత పేర్ని నాని మాట్లాడుతూ ఏపీ చరిత్రలో చూస్తే అత్యధిక మంది కాపు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ వైసీపీ మాత్రమే అని చెప్పారు. కాపులకు అనేక రకాలుగా న్యాయం చేసినది కూడా వైసీపీయే అని ఆయన అంటున్నారు. కాపుల విషయంలో రెండవ మాట లేకుండా ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నది కూడా తమ ప్రభుత్వమే అని చెప్పారు.

తాము సామాజికపరంగా కూడా చర్చించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసామని, తమ అజెండా వివరాలు అన్నీ కూడా కాపుల సంక్షేం కోసమే అని ఆయన అన్నారు. తమది కుల సమావేశం కాదు కాపుల అభ్యున్నతి ఎంత మేర చేశాం, ఇంకా ఏ మేరకు చేయాల్సి ఉంది అన్నది కూలంకషంగా చర్చిస్తామని చెబుతున్నారు. అలాగే బాధ్యాయుతంగా తాము పనిచేస్తూంటే తమ మీద విపక్షాలు నిందలు వేయడమేంటి అని ఆయన ప్రశ్నించారు. కాపు మంత్రులు ఎమ్మెల్యేల మీటింగ్ అంటే విపక్షాలు ఎందుకు కంగారు పడుతున్నాయని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి చూస్తే వైసీపీ కాపుల మీటింగ్ మాత్రం పొలిటికల్ గా ఏపీలో హీట్ పెంచేలాగానే సాగుతుంది అని అంటున్నారు.