Begin typing your search above and press return to search.

పరువు రోడ్డున పెట్టడంలో పోటీ పడ్తున్నారా?

By:  Tupaki Desk   |   15 Oct 2017 5:55 PM GMT
పరువు రోడ్డున పెట్టడంలో పోటీ పడ్తున్నారా?
X
ముద్రగడ పద్మనాభం ఎన్ని రకాలుగా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నా ఈ ప్రభుత్వం కాపులకు ద్రోహం చేస్తున్నదని హెచ్చరిస్తున్నా.. వారికిచ్చిన మాట ప్రకారం.. రిజర్వేషన్ విషయంలో నిర్ణయం తీసుకోకుండానే బాబు సర్కారు రోజులు నెట్టేస్తోంది. అయితే.. కాపుల్లో మాత్రం ఆదరణ తగ్గకుండా చూసుకోడానికి వారు కాపు కార్పొరేషన్ ను బ్రహ్మాస్త్రంలాగా భావిస్తే.. అది కాస్తా బ్యాక్ ఫైర్ అయి ఇప్పుడు ప్రభుత్వం పరువును బజారుకీడ్చింది.

కాపు కార్పొరేషన్ లో లెక్కకు మిక్కిలిగా జరిగిన అవినీతి బాగోతాలు... ఎండీ అమరేంద్ర బదిలీ వరకు దారితీశాయి. ఎండీ ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు వచ్చిన ఆరోపణలు వచ్చిన సంగతి పాఠకులకు తెలుసు. అయితే.. తాజా పరిణామం ఏంటంటే.. తమ తప్పేమీ లేదంటే... తమ తప్పేమీ లేదని చాటుకోవడానికి కాపు కార్పొరేషన్ ఎండీ మరియు ఛైర్మన్ లమధ్య లడాయి మొదలైంది. ఈ ఇద్దరూ పోటాపోటీగా ప్రెస్ మీట్ లు పెట్టి తాము కడిగిన ముత్యాలమే అని చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రభుత్వం పరువును మరింతగా భ్రష్టు పట్టించేలా ఉన్నాయని పలువురు అనుకుంటున్నారు.

తనను మాజీగా మార్చిన తర్వాత కూడా ఎండీగా పనిచేసిన అమరేంద్ర.. ఆదివారం రాత్రి 8 గంటలకు అదే కార్పొరేషన్ భవనంలో ప్రెస్ మీట్ కుసిద్ధం అయ్యారు. అయితే నువ్వు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి వీల్లేదంటూ.. ఛైర్మన్ రామానుజయ వచ్చి అడ్డం పడ్డారు. ఇద్దరూ పోటా పోటీగా ప్రెస్ మీట్ లు పెట్టడానికి సిద్ధమైపోయి అంతా రచ్చ రంబోలా అయిపోయింది.

అయితే ఎండీ ప్రెస్ మీట్ పెట్టదలచుకున్న విషయాలు ఏమిటి? ఛైర్మన్ వచ్చి దానిని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నంలో మతలబు ఏమిటి? అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో జరుగుతోంది. ఛైర్మన్ రామానుజయకు సంబంధించిన బాగోతం కూడా ఏమైనా బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఆయన వచ్చి అడ్డుకున్నారేమో అని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు తప్పిదాలు ఎవరివో విచారణలో తేలాల్సి ఉంది.