Begin typing your search above and press return to search.

తెలుగు త‌మ్ముళ్ల‌పై ఫైర్ అయిన క‌న్నా

By:  Tupaki Desk   |   23 May 2017 5:14 AM GMT
తెలుగు త‌మ్ముళ్ల‌పై ఫైర్ అయిన క‌న్నా
X
ఏపీ అధికార‌ప‌క్ష ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్య‌లు ఏపీ బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. త‌మ‌ను తీసిపారేసిన‌ట్లుగా మాట్లాడిన టీడీపీ ఎంపీ కేశినేని నాని తీరుపై అగ్గి ఫైర్ అవుతున్నారు. సార్వత్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ పొత్తుపై నాని చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ క‌మ‌ల‌నాథులు తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ సీరియ‌స్ అయ్యారు.

ఏపీ బీజేపీ నేత‌ల్ని విమ‌ర్శించ‌టం ఏపీ టీడీపీ నేత‌ల‌కు ఈ మ‌ధ్య‌న ఒక అల‌వాటుగా మారింద‌ని వ్యాఖ్యానించారు. తొలుత తెలుగు త‌మ్ముళ్లు విమ‌ర్శించ‌టం.. ఆ త‌ర్వాత ఆ వ్యాఖ్య‌ల్ని చంద్ర‌బాబు ఖండించ‌టం ఒక అల‌వాటుగా మారినంద‌ని ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఏపీ టీడీపీ నేత‌ల తీరు చూస్తుంటే.. ఇదంతా ఒక నాట‌కం మాదిరి అనిపిస్తోంద‌న్నారు. ఇలాంటి కుట్ర‌ల్ని అధినాయ‌క‌త్వం దృష్టికి తీసుకెళ‌తాన‌న్నారు. ఎంపీ నాని చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లా? పార్టీ అభిప్రాయ‌మా? అన్న‌ది చెప్పాల‌న్నారు. అయినా.. ప్ర‌ధాన‌మంత్రిని ఒక రాష్ట్ర ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష నేత క‌ల‌వ‌టం త‌ప్పేమిట‌ని ప్ర‌శ్నించారు. ఈ ఇష్యూలో పెడార్థాలు తీయాల్సిన అవ‌స‌రం ఏముంద‌న్న ఆయ‌న‌.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకుంటే.. విజ‌య‌వాడ‌లో టీడీపీకి అంత మెజార్టీ వ‌చ్చేదా? అని సూటిగా ప్ర‌శ్నించారు.

ఇటీవ‌ల బెజ‌వాడ ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు లేకుండా మ‌రింత భారీ మెజార్టీతో విజ‌యం సాధించేవాళ్ల‌మ‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ఏపీ బీజేపీ నేత‌లు ర‌గిలిపోతున్నారు. ఈ కార‌ణంతోనే ఎప్పుడో కాని నోరు విప్ప‌ని క‌న్నా సైతం కేశినేనిపై నిప్పులు చెరిగిన‌ట్లుగా మండిప‌డ్డారు. మ‌రి.. క‌న్నాకు తెలుగు త‌మ్ముళ్లు కౌంట‌ర్ అటాక్ ఇస్తారా? లేక‌.. మౌనంగా ఉండిపోతారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.