Begin typing your search above and press return to search.

కోర్టులో ‘కన్నా’కు ఎదురుదెబ్బ.. నెలవారీ భరణం చెల్లించాల్సిందే

By:  Tupaki Desk   |   14 Jun 2023 5:18 PM GMT
కోర్టులో ‘కన్నా’కు ఎదురుదెబ్బ.. నెలవారీ భరణం చెల్లించాల్సిందే
X
సీనియర్ నేత.. ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుటుంబానికి సంబంధించిన ఒక ఇష్యూలో ఆయన వాదనను కోర్టు కొట్టేసింది. ఆయన పెద్ద కోడలు శ్రీలక్ష్మీ కీర్తి గత ఏడాది విజయవాడ కోర్టులో వేసిన గృహహింస పిటిషన్ పై ఇచ్చిన తీర్పుకు సంబంధించి.. అప్పీల్ లో ఎదురుదెబ్బ తగిలింది. పరిహారం.. నెలవారీగా చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.

అసలేం జరిగిందంటే..

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు నాగరాజుకు 2006లో మేనత్త కుమార్తె శ్రీలక్ష్మీ కీర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2013లో వారికో కుమార్తె జన్మించారు. అయితే.. కొన్నాళ్ల తర్వాత వారి వైవాహిక జీవితంలో సమస్యలు రావటంతో విజయవాడ ఒకటో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ఆమె గృహహింస పిటిషన్ ను జారీ చేశారు.

తనను తన భర్త ఇంట్లో నుంచి బయటకు పంపినట్లుగా ఆరోపించారు. తనను తన భర్త వేధింపులకు గురి చేసినట్లుగా చెప్పారు. తనను ఇంట్లోకి రానివ్వటం లేదని.. తనతో పాటు తన బిడ్డకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె రూ.కోటి పరిహారాన్ని.. నెలకు రూ.50వేల చొప్పున ఖర్చులు ఇప్పించాలని కోర్టునుకోరారు.

ఈ కేసులో ప్రతివాదులుగా కన్నా నాగరాజును.. కన్నా లక్ష్మీనారాయణను.. ఆయన సతీమణి విజయలక్ష్మీని చేర్చారు. దీనిపై కోర్టు విచారణ పూర్తి చేసి.. పిటిషనర్ అయిన కోడలు శ్రీలక్ష్మీ కీర్తికి ఇంట్లో నివాసవసతి కల్పించాలని.. అది సాధ్యం కాని పక్షంలో ప్రత్యామ్నాయ వసతి కోసం నెలకు రూ.50వేలు భరణం చొప్పున.. రూ.కోటి పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ఖర్చుల్ని ఆమెకు చెల్లించాలని పేర్కొంది. అంతేకాదు.. కుమార్తె అనారోగ్యానికి చేసిన వైద్య ఖర్చుల్ని కూడా ఆమెకు ఇవ్వాలని చెప్పింది.

కోర్టు ఆదేశించిన అంశాల్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని చెప్పింది. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ అప్పీలుకు వెళ్లారు. అక్కడి కోర్టు కూడా ఈ అంశాల్ని పరిశీలించి.. ఉభయ వర్గాల వాదనల్ని విన్న అనంతరం కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. కన్నా పిటిషన్ ను డిస్మస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.