Begin typing your search above and press return to search.

టీడీపీతో క‌టిఫ్ చెప్పేద్దామా...!

By:  Tupaki Desk   |   14 Sep 2016 11:30 AM GMT
టీడీపీతో క‌టిఫ్ చెప్పేద్దామా...!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యం ఎన్డీఏ మిత్ర‌ప‌క్షాలైన బీజేపీ - టీడీపీల మ‌ధ్య చిచ్చుర‌గిలిస్తూనూ ఉంది. ప్ర‌త్యేక ప్యాకేజీతో ఏపీకి ఎంతో చేశామ‌ని చెబుతున్న కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు భ‌విష్య‌త్తులోనూ ఈ సాయాన్ని కొన‌సాగిస్తామ‌ని అంటున్నారు. అయితే, కేంద్రం వ్యాఖ్య‌ల‌పై విప‌క్షాలు మండిప‌డ‌డం - ప్యాకేజీకి నిర‌స‌న‌గా రాష్ట్ర బంద్‌ కు పిలుపునివ్వ‌డం తెలిసిందే. కానీ, సీఎం మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ప్యాకేజీని స్వాగితించారు. కేంద్రంలోని పెద్ద‌లకు ముఖ్యంగా ప్ర‌ధాని మోడీకి ఫోన్ చేసి మ‌రీ థ్యాంక్స్ చెప్పారు. అయినా కూడా.. బీజేపీ నేతల్లో ఎక్క‌డో చంద్ర‌బాబుపై అనుమానాలు నెల‌కొన్నాయి.

ప్ర‌స్తుతం ప్యాకేజీని బాగానే ఉంద‌ని అంటున్నా.. మ‌ళ్లీ ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆయ‌న ప్ర‌జ‌ల్లో ఉన్న హోదా సెంటిమెంట్ ప్ర‌కారం.. ఈ విష‌యంలో త‌న త‌ప్పులేద‌ని పేర్కొంటూ.. ప్ర‌జ‌ల ముందు ఓ ప‌థ‌కం ప్ర‌కారం బీజేపీని దోషిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం తో పాటు మిత్ర బంధాన్ని సైతం ఆయ‌న తెగ‌తెంపులు చేసుకునే ప్ర‌మాదం ఉంద‌ని ఇప్ప‌టి నుంచే క‌మ‌లం పార్టీ నేత‌లు ఊహిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడే తాము చంద్ర‌బాబు సైకిల్ నుంచి దిగిపోయి సొంతంగా ఎందుకు ఎద‌గ కూడ‌ద‌ని వారు అంత‌ర్మ‌థ‌నం చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల జ‌రిగిన ఓ ప‌రిణామం కూడా విశ్లేష‌కుల‌ను ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది.

గత వారంలో కేంద్రం నుంచి వచ్చిన అరుణ్ సింగ్ - సిద్ధార్థ నాథ్ సింగ్ లు బీజేపీ జిల్లా పదాధికారులు - జిల్లా అధ్యక్షులు - ఇన్ చార్జ్ లతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్యాకేజీ - చంద్ర‌బాబు వైఖ‌రి - వ‌చ్చే ఎన్నిక‌లు వంటి వాటిపై చ‌ర్చ వ‌చ్చింది. రాష్ట్ర నేత కందుల రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని మరో పదేళ్ల వరకూ ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, ఇదే సమయంలో ప్రజా విశ్వాసాన్ని చూరగొనడంలో వైకాపా విఫలమవుతోందని చెబుతూ - కొత్తగా ఓటు హక్కు వచ్చే యువతకు బీజేపీ దగ్గర కావచ్చని చెప్పారట.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు పాల‌న‌పై అన్ని ప్రాంతాల్లోనూ అసంతృప్తి ఉంద‌ని ఈ క్ర‌మంలో బీజేపీ సొంతంగా ఎదిగితే.. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల నాటికి నిల‌దొక్కుకునే ఛాన్స్ ఉంద‌ని చెప్పార‌ట‌. గ‌తంలో బీజేపీతో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన శైలిని కూడా ఆయ‌న ఈ సంద‌ర్బంగా చెప్పార‌ట‌. అవ‌స‌రం తీరిపోతే .. చంద్ర‌బాబు క‌మ‌లాన్ని వ‌ద‌లిపెడ‌తార‌ని, ఆయ‌నక‌న్నా ముందే మ‌నం సైకిల్ దిగి.. సొంతంగా ఎదుగుదామ‌ని అన్నార‌ట‌. అయితే, కేంద్రం నేత‌లు మాత్రం.. ఇప్ప‌టికిప్పుడు ఈ ప‌రిణామం మంచిదికాద‌ని - స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చూద్దామ‌ని అన్నార‌ట‌. ఏదేమైనా.. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుపై రాష్ట్ర బీజేపీ నేత‌ల మ‌నోగ‌తం వెల్ల‌డికావ‌డం గ‌మ‌నార్హం. ఈ లెక్క‌న చూస్తే 2019 ఎన్నిక‌ల నాటికి ఏపీ రాజ‌కీయాల్లో చాలా ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.