Begin typing your search above and press return to search.

సొంత సామాజిక వర్గమే గుస్సా అవుతోందా....?

By:  Tupaki Desk   |   31 Jan 2022 3:30 AM GMT
సొంత సామాజిక వర్గమే  గుస్సా అవుతోందా....?
X
ఏపీ రాజకీయాలు అంటేనే సామాజిక సమీకరణలుగా చూడాలి. కులం బలం ఉన్న వారు అధినేతలుగా మారుతారు. అలా కులాన్ని దన్నుగా చేసుకుని దశాబ్దాలుగా రాజకీయాలు చేసిన వారూ ఉన్నారు. ఇక టీడీపీని ఎన్టీయార్ స్థాపించినపుడు ఆయన మీద కులం బ్రాండ్ అయితే లేదు. ఒక విధంగా చెప్పాలీ అంటే టోటల్ గా ఉమ్మడి ఏపీ అంతా ఒక్కటిగా నిలిచి మద్దతు ఇచ్చింది. ఆ తరువాత కాలంలో టీడీపీ మీద నెమ్మదిగా ఆ నీడ పడింది.

ఇక చంద్రబాబు ఎన్టీయార్ ని దించేసి సీఎం అయ్యాక బాగానే సొంత సామాజికవర్గం మీద ఆధారపడ్డారు. ఆయన ముమ్మారు సీఎం అయ్యారు అంటే దాని వెనక ఆర్ధికంగా రాజకీయంగా సొంత సామాజికవర్గం దన్ను నూరు శాతం ఉంది. టీడీపీని ఎన్టీయార్ తరువాత కొనసాగేలా చూడాలనే ఆ వర్గం వారు బాబుని సీఎం గా ఒప్పుకున్నారని చెబుతారు.

ఇక బాబు సీఎం అయ్యాక వారి ప్రయోజనాలు ఎంతవరకూ నెరవేరాయి, ఎవరి వల్ల ఎవరు బాగు పడ్డారు అన్నది మరో విషయం అయితే కొన్ని విషయాలు వీటికి అతీతంగా ఉంటాయి. అవి ప్రతిష్టకు సంబంధించినవి. ఎన్టీయార్ ని కొన్ని కారణాల వల్ల గద్దె దింపినా ఆయన కమ్మ సామాజిక వర్గానికి ఆరాధ్యుడు. ఆయన అంతటి నేత మరొకరు ఉండరు, పుట్టబోరు అని కూడా వారు ఎప్పటికీ బలంగా నమ్ముతారు.

రాజకీయంగా కమ్మలను ఫ్రంట్ లైన్ లో ఫస్ట్ టైమ్ నిలబెట్టి రాజ్యాధికారానికి చేరువ చేసిన ఎన్టీయార్ ని దేవుడిగానే చూస్తారు. అలాంటి ఎన్టీయార్ దివంగతులు అయ్యాక ఆయనకు టీడీపీ ఏం చేసింది అన్నదే ఇపుడు వస్తున్న ప్రశ్న. నిజానికి ఈ ప్రశ్న చాలాకాలంగా ఉన్నా కూడా ఇపుడే ఎందుకు వచ్చింది అంటే కొత్త జిల్లాల పేరిట జగన్ తేనెతుట్టెను కదిపారు.

ఆయన విజయవాడకు ఎన్టీయార్ పేరు పెట్టారు. దాంతోనే కమ్మలు బయట హ్యపీగా ఉన్నా కూడా లోలోపల టీడీపీ మీద రగులుతున్నారు. నిజానికి ఈ డెసిషన్ తీసుకున్న తరువాత కమ్మల మద్దతు వైసీపీకి ఎంతవరకూ దక్కుతుంది అన్న చర్చ పక్కన పెడితే టీడీపీ మీద రుసరుసలు మొదలైపోయాయి. టీడీపీ వ్యవస్థాపకుడిని ఆ పార్టీ సరైన తీరున గౌరవించుకోలేకపోయింది అన్న ఆవేదన కూడా కమ్మ సామాజికవర్గంలో ఉందని ప్రచారం సాగుతోంది.

జగన్ ఎన్టీయార్ జిల్లాను ప్రకటించడం కంటే ముందే చంద్రబాబు ఆ పని చేస్తే గర్వంగా తలెత్తుకుని తిరిగేవారం కదా అన్నదే వారి అసలైన భావనగా ఉందిట. తమ ఆరాధ్య దైవం విషయంలో తామే అవకాశాలను వదులుకుని వేరే వాళ్ళు చేస్తే చప్పట్లు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నదే వారి ఆవేదనగా ఉందిట.

చంద్రబాబు ఏపీకి సీఎం అయిన తరువాత 13 జిల్లాలను నాడు పెంచి ఒక దానికి ఎన్టీయార్ పేరు పెట్టి ఉంటే ఎంతో బాగుండేది అని కూడా అంటున్నారుట. ఈ విషయంలో చంద్రబాబు ఏం లెక్కలు వేసుకున్నారో ఏమో కానీ జగన్ కి ఈజీగా ఈ చాన్స్ ఇచ్చేశారని మధనపడుతున్నారుట. దూకుడుగా రాజకీయం చేయడంతో కేసీయార్, జగన్ లను చూసి బాబు కూడా నేర్చుకోవాల్సి ఉందని కూడా అంటున్నారుట. బాబు రాజకీయాల్లో సీనియర్ ని అని చెప్పుకుంటారు కానీ ఆయన చాలా విషయంలో తప్పటడుగులే వేశారు అని కూడా సొంత కులం వారే ఇపుడు ఎత్తి చూపుతున్నారని టాక్.

మొత్తానికి ఎన్టీయార్ పేరిట జిల్లా కమ్మ వారికి ఆనందకరమే అయినప్పటికీ అది జగన్ సర్కార్ ప్రకటించడం పట్ల ఇబ్బందిగా ఉందని అంటున్నారు. తాము అధికారంలో ఉన్న రోజుల్లో చేసుకోలేకపోవడం నిజంగా అతి పెద్ద తప్పిదమని, అందుకు చంద్రబాబు నాన్చుడు విధానాలే ఆ సామాజిక వర్గం ఆగ్రహావేశాలకు లోను అవుతోందిట. అంటే జగన్ చేసిన పని టీడీపీకి మూలాధారం అయిన ఒక సామాజికవర్గంలో ఎంతటి ఆలోచనలు రేకెత్తించిందో మరి అని అంటున్నారు.