Begin typing your search above and press return to search.

అమెరికాను భారతీయులు ఏలేస్తారా?

By:  Tupaki Desk   |   20 Jan 2021 8:37 AM GMT
అమెరికాను భారతీయులు ఏలేస్తారా?
X
అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ కమలా హ్యారిస్​ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో రానున్నరోజుల్లో భారతీయులు అమెరికా రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నారా? అన్న చర్చ మొదలైంది. కమలాను డెమోక్రటిక్​ అభ్యర్థిగా ప్రకటించినప్పుడే భారతీయుల మనసుల్లో ఆనందం వెల్లివెరిసింది. కమలా తండ్రి.. డోనాల్డ్​ హారిస్​ జమైకాకు చెందిన వారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్​ భారతీయ మహిళ. ఆమె స్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై. కమలా హారిస్​ రాజకీయాల్లో ఎంతో చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆమె ఆలోచనలు కూడా విస్తారంగా ఉంటాయి.

ఆమె ప్రసంగాలు ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటాయి. కమలా పొలిటికల్ ఎంట్రీ.. ఉపాధ్యక్షురాలిగా పదవి చేపట్టడం అమెరికాలో భారతీయుల పొలిటికల్​ ఎంట్రీకి ఉపయోగపడుతుందా? భవిష్యత్​లో కమలా హ్యారిస్​ అమెరికా అధ్యక్షురాలిగా కూడా అయ్యే అవకాశం ఉందా? అన్న అంశాలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. మరోవైపు అమెరికాలో మొత్తం భారతీయ అమెరికన్ల జనాభా 1.5 శాతం మాత్రమే. అయితే జనాభా క్రమంగా పెరుగుతూ ఉంది. అయితే ఇంత తక్కువ సంఖ్యలో భారతీయులు అమెరికా రాజకీయాల్లో ప్రభావితం చూపగలరా? అన్న విషయం ప్రశ్నార్థకమే.

2016లో జరిగిన ఒక సర్వేలో(ఎన్ఎఎఎస్ పోస్ట్-ఎలక్షన్) 48 శాతం భారతీయ అమెరికన్లు డెమోక్రాట్లకు లేదా డెమాక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉంటారని తేలింది. 22 శాతం భారతీయులు మాత్రమే రిపబ్లికన్ పార్టీ వైపు ఉన్నారు. ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, మిషిగన్‌లో రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్ ఓటర్ల ఉనికి బలంగా ఉంది. అయితే గత ఎన్నికల్లో మాత్రం మెజార్టీ ఇండియన్లు జో బైడెన్​కే మద్దతు ఇచ్చినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం భారతీయుల ఆశలకు అనుగుణంగా పనిచేయవచ్చు. ఇప్పటికే జో బైడెన్​ టీంలో పలువురు భారతీయులకు అవకాశం దక్కింది. హెచ్​1బీ వీసాలు, గ్రీన్​కార్డుల జారీ తదితర విషయాల్లో జో బైడెన్​ భారతీయులకు అనుకూలంగా ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది. అయితే భవిష్యత్​లో భారతీయులు అమెరికా రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తారా? లేదా? అన్న విషయం వేచి చూడాలి.