Begin typing your search above and press return to search.

ఎంపీగా 'కళా' పోటీచేయబోతున్నారా ?

By:  Tupaki Desk   |   13 April 2023 12:53 PM GMT
ఎంపీగా కళా పోటీచేయబోతున్నారా ?
X
రాబోయే ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా కళా వెంకట్రావు పోటీచేయటం దాదాపు ఖాయమైనట్లే ఉంది. పోయిన ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసిన అశోక్ గజపతిరాజు ఓడిపోయిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో కూడా తాను ఎంపీగా తన కూతురు అదితి విజయనగరం ఎంఎల్ఏగా పోటీచేయాలని అశోక్ ప్రయత్నాలు చేశారు. అయితే ఇందుకు చంద్రబాబు అంగీకరించలేదట. ఫ్యామిలికి రెండు టికెట్లు ఇవ్వటం సాధ్యంకాదు కాబట్టి కూతురు ప్లేసులో ఎంఎల్ఏగా అశోక్ నే పోటీచేయమని చెప్పేశారట.

చంద్రబాబు చెప్పటంతో ఇష్టంలేకపోయినా అశోక్ అంగీకరించక తప్పలేదు. విజయనగరం ఎంపీగా సీనియర్ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావును రంగంలోకి దింపాలని డిసైడ్ అయ్యారట. ఈమధ్యనే విశాఖపట్నంలో జరిగిన జోనల్ సమావేశంలో సీనియర్ల అభిప్రాయాలను చంద్రబాబు తీసుకున్నారట.

దాని తర్వాతే కళాను ఎంపీగా పోటీచేయించాలని డిసైడ్ అయినట్లు పార్టీలో టాక్ మొదలైంది. కళా ప్లేసులో ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కలిశెట్టి అప్పలనాయుడును పోటీచేయించబోతున్నారని సమాచారం.

కలిశెట్టి కూడా పార్టీలో చాలాకాలంగా ఉన్నారు. ఎచ్చెర్ల మార్కెట్ యార్డు కమిటి ఛైర్మన్ గా కూడా పనిచేశారు. ఎంపీగా కళా, ఎంఎల్ఏగా కలిశెట్టి తప్పకుండా గెలుస్తారని పార్టీలోని సీనియర్లు చంద్రబాబుతో చెప్పారట. దాంతో మెజారిటి అభిప్రాయం ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మరి చంద్రబాబు నిర్ణయం ఏ మేరకు సఫలమవుతుందో చూడాల్సిందే.

ఇదే సమయంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏగా పోటీచేయటానికి డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని మొన్నటి టూరులో చంద్రబాబుకు చెప్పారట. రాబోయే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా నర్సీపట్నం ఎంఎల్ఏగా పోటీచేసేందుకు రామ్మోహన్ నాయుడు ఇప్పటికే రెడీ అయిపోయారు. ఒకవైపు చంద్రబాబు వద్దని చెబుతున్నా ఎంపీ వినిపించుకోవటంలేదట. ఎక్కువగా నర్సీపట్నంలోనే తిరుగుతున్నారు.

రామ్మోహన్ ఎంఎల్ఏగా పోటీచేస్తే చంద్రబాబుకు తలనొప్పులు తప్పవు. ఎందుకంటే బాబాయ్ అచ్చెన్నాయుడు ఎంఎల్ఏగా ఉన్నారు. రేపు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రిపదవి కోసం గొడవలు మొదలవుతాయి. అలాగే జిల్లాలో పట్టుకోసం ఆరాటం మొదలవుతుంది. ఇవన్నీ ఊహించే చంద్రబాబు రామ్మోహన్ ప్రయత్నాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంలేదు. అయినా ఎంపీ వినిపించుకోవటంలేదు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.